వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పేరునే మార్చేశారు..
-సంతనూతలపాడు ఎమ్మెల్యే ఎ.సురేశ్ - సర్కారు జీవోలో బి.ఎన్.విజయ్‌కుమార్
అమరావతి: ప్రజాస్వామ విలువలకు పాతరేసి రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రజాప్రతినిధుల పేర్లను కూడా మార్చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో అధికార దుర్వినియోగానికి, వివక్షకు పాల్పడుతున్నారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిమూలపు సురేశ్‌నే రాష్ట్ర సర్కారు మార్చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేగా కూడా గుర్తించడానికి బాబు సర్కారు ఇష్టపడటం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో సీసీ రహదారుల నిర్మాణానికి రూ.2కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వుల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ కుమార్ వినతి మేరకు సీసీ రహదారులకు నిధులు మంజూరు చేసున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి సంజయ్‌గుప్తా జీవో ఆర్‌టీ.236 జారీ చేశారు. సంతనూతలపాడు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఎ.సురేశ్ ఎన్నికైనప్పటికీ జీవోలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాని విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికార యంత్రాంగమే విస్తుపోతోంది.
ప్రధాన ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేయకుండా చంద్రబాబు వివక్షతో వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినతిపత్రాలను సమర్పించినప్పటికీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, లేదా ఇన్‌చార్జ్ నాయకుల పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31న హడావుడిగా ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 31 నియోజకవర్గాలకు రెండేసి కోట్ల చొప్పున రూ.62 కోట్లను విడుదల చేస్తూ 31 జీవోలను జారీ చేయడం గమనార్హం.
మాడుగుల నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేను కాదని మాజీ ఎమ్మెల్యే పేరుతో నిధులను మంజురు చేశారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే పేరుతో నిధులను విడుదల చేశారు.