సాక్షి, అమరావతి : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ముస్లింలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం ప్రార్ధనలను తమ నివాస గృహాల నుండే చేపట్టాలని విన్నవించారు.
ప్రస్తుతం దేశం క్లిష్ట దశలో ఉందని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో అన్ని వర్గాల ప్రజలు అధికారులతో సహకరించాలని పిలుపు నిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం జనాభాను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని గవర్నర్ తెలిపారు. దేశంలోని అన్ని మతాలు, కులాలు, వర్గాలకు చెందిన ప్రజల చురుకైన సహకారంతో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో విజయం సాధించగలమన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.
(చదవండి : మానవాళి క్షేమం కోసం ప్రార్థించండి)
ప్రస్తుతం మానవజాతి కరోనా రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కుంటుందని ప్రతి ఒక్కరూ తమ సామాజిక, మతపరమైన కార్యక్రమాలలో భౌతిక దూరం పాటించవలసిన అవసరం ఏంతైనా ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ముస్లిం సోదర, సోదరీమణులు అందరూ ఇంట్లోనే ఉండి, ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన బలం చేకూరేలా విశ్వవాళి కోసం ప్రార్థించాలని గవర్నర్ అన్నారు. మేము, మనం అన్న బహువచనం భారతీయ సమాజంలో అంతర్భాగమని, భారతీయ సంస్కృతిలో ఇది అత్యంత కీలకమైన అంశం కాగా, పలు సవాళ్లను ఎదుర్కునే క్రమంలో విభిన్న మతాల వారు ఐక్యంగా పోరాటాలు చేసి విజయం సాధించిన చరిత్ర భారతావని సొంతమని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment