సాక్షి, విశాఖపట్నం నెట్‌వర్క్: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఎన్నికలకు ముందు ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాధితులకు హితవు పలికిన విధంగానే..పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలోనే హామీ ఇచ్చిన విధంగా రూ.10వేల లోపు డిపాజిటర్లకు న్యాయం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
13 జిల్లాల్లో రూ.10 వేలలోపు డిపాజట్లు 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. ఇందులో తొలి దశలో జిల్లా 52,005 డిపాజిటర్లకు సుమారుగా రూ.46 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న బాధితులందరిలోనూ పండగ వాతావరణం నెలకొంది. నగరంలో పలుచోట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని చూసిన టీడీపీ నేతలు’
అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు చెల్లించాల్సి ఉందని, కానీ ఆ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు అండ్ కో బృందం కుట్ర పన్నుతుందని పలువురు నాయకులు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా, వీరిలో 9 లక్షల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బాధితులు ఉన్నారు. చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం డిపాజిట్ దారులకు వేదన మిగిల్చారని, అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవాల్సిన గత ప్రభుత్వం సంస్థ ఆస్తులు కబ్జా చేసేందుకు అధిక ప్రయత్నాలు చేసిందని అన్నారు.
సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం..
ఆరేళ్ల క్రితం రూ.10వేలు డిపాజిట్ చేశాను. నెలకు వెయ్యి రూపాయల చొప్పున పాలసీ కట్టాను. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు నెలల్లో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు మా కుటుంబంలో మరో రూ. 60 వేలు కూడా డిపాజిట్ చేశాం. జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
–ఎ. వెంకటలక్ష్మి, హెచ్‌బీ కాలనీ.
మా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటే..
మా పిల్లల పేరు మీద డిపాజిట్లు చేశాం. అప్పట్లో రూ.10వేలు, రూ.10 వేలు చొప్పున రెండు పాలసీలు చేశాం. మొత్తం రూ.20 వేలు డిపాజిట్ చేశాం. డబ్బు తక్కువే కావొచ్చు కానీ. మా లాంటి పేద కుటుంబాలకు ఇదే ఆసరా. అవి కూడా పోయేసరికి చాలా బాధనిపించింది. టీడీపీ నేతలకు ఎన్నోసార్లు గత ఐదేళ్లలో మోరపెట్టుకున్నాం. నిరాశే మిగిలింది. అలాకాకుండా ఎన్నికలకు ముందు హామి ఇచ్చిన జగనన్న తన తండ్రిలాగే మాట తప్పకుండా మాలాంటి పేదలు ఎందరినో కాపాడారు. మాప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటాం.
–సీహెచ్ మోహిని, వెంకోజీపాలెం.
కష్టపడి సంపాదించిన డబ్బులు పోయాయి ..
నేను రోజూ కూలి చేసుకున్న సంపాదనను మా పిల్లలకు ఆసరాగా ఉంటాయని నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ.20 వేల రూపాయలు డిపాజిట్ చేశాను. నాకు తెలియకుండా నా భర్త కూడా నెలకు 1200 చొప్పున 12 నెలలు డిపాజిట్ చేశారు. మొత్తం పోయే సరికి చనిపోవాలనిపించింది. ఇప్పుడు జగన్ బాబు ఇస్తున్నాడని తెలిసి చాలా ఆనందంగా ఉంది.
–పచ్చిపాల తవుడమ్మ, మహారాణిపేట
మా ఇంట్లో సంబరాలు చేసుకున్నాం..
నేను టీ షాపు పెట్టుకుని జీవిస్తున్నాను. దానిపై వచ్చే ఆదాయం డిపాజిట్ల పేరిట రూ.60 వేలు కట్టాను. మరో పాలసీ రూ.54 వేలు కట్టాను. రెండూ పోయే సరికి నెలరోజుల పాటు నిద్ర కూడా పట్టలేదు. మా పిల్లలు భవిష్యత్తుకు పనిచేస్తాయని డిపాజిట్ చేస్తే మోసం చేశారని బాధపడ్డాం. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు న్యాయం చేశారు.
–అమర భాగ్యలక్ష్మి, మద్దిలపాలెం.
సీఎంకు కృతజ్ఞతలు..
అగ్రిగోల్డ్ బాధితులకు 10వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. కష్టపడిన డబ్బులను అగ్రిగోల్డ్‌లో దాచుకోవడం జరిగింది. సంస్థ మూసివేయడంతో డబ్బులు వస్తాయో లేదా అర్థం కాలేదు. నూతన ప్రభుత్వం 10వేల లోపు ఉన్నవారికి చెల్లించేందుకు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది.
–మన్నా వీరస్వామి, అనంతగిరి
Comments
Please login to add a commentAdd a comment