
వెంకటాపురం గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు, విశాఖ సుజాత నగర్‌లోని పునరావాస కేంద్రంలో చిన్నారికి అన్నం తినిపిస్తున్న ఓ తల్లి
మూడు రోజులు.. 72 గంటలు.. గడియారంలోని ముల్లుల కంటే వేగంగా స్పందిస్తూ.. విశాఖలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపుతూ.. విషాద ఘటన నుంచి నగరాన్ని కోలుకునేలా చేశారు. మరో 24 గంటల్లో పూర్తిగా సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇదిలావుంటే.. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో గల ఎల్‌జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ మోనోమర్ వాయువు లీకైన మూడు రోజుల్లోనే పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణలో.. ఏడుగురు మంత్రులు విశాఖలోనే మకాం వేసి స్టైరీన్ ప్రభావానికి గురైన ఐదు గ్రామాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఓ వైపు బాధితుల ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలు తీసుకుంటూనే.. గ్రామాల్లో పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలిలో స్టైరీన్ వాయువు మోతాదు దాదాపు సున్నా స్థాయికి వచ్చినప్పటికీ.. ఆ గ్రామాల్లో పకడ్బందీగా పారిశుధ్య చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు నిశ్చింతగా నివాసం ఉండేందుకు వీలుగా తీర్చిదిద్దిన తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు అటు అధికారులు.. ఇటు మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదిలావుండగా.. అత్యుత్తమ వైద్య సేవలందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకూ 190 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
అధ్యయనం మొదలైంది
► ప్రమాదం ఎలా జరిగిందనే విషయంతోపాటు ప్రమాద తీవ్రత వల్ల అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు సంభవించాయనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఉన్నతస్థాయి కమిటీలు, నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి.
► ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్‌ఎన్)కు సంబంధించిన నలుగురు శాస్త్రవేత్తలు ఎల్‌జీ పాలిమర్స్‌లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
► నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి)కు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలతో కూడిన బృందం బాధిత గ్రామాల్లో పర్యటించింది.
► ఐదు గ్రామాల్లోని మొక్కలు, నీరు, మట్టి నమూనాలు, పండ్ల మొక్కల అవశేషాలు మొదలైనవి సేకరించారు. వీటని ఆదివారం నాగ్‌పూర్‌లోని ల్యాబ్‌కు తరలించారు. సోమవారం కూడా మరోసారి నమూనాలు సేకరిస్తారు.
► రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ కూడా పరిశ్రమ నుంచి వివరాలు సేకరించింది. ప్రస్తుతం ఆ గ్రామాల్లో కాలుష్య పరిస్థితి ఎలా ఉంది, పరిశ్రమలో కాలుష్యం ఎంత ఉందనే గణాంకాలను నమోదు చేస్తోంది.
► అక్కడ వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
సాంకేతిక నిపుణుల పర్యటన
► కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు సంతన్ గీతే, వినయ్‌రే ఆదివారం రెండు దఫాలుగా ఎల్‌జీ పాలిమర్స్ సంస్థను పరిశీలించి, ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు.
► నీరు, మట్టి, గాలి శాంపిల్స్ సేకరించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న ఎల్‌జీ ప్రధాన కార్యాలయ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
► సాంకేతిక అంశాలు, తప్పిదాలపై ఆరా తీశారు. సోమవారం సాయంత్రానికి ప్రాథమిక నివేదిక సిద్ధం కానుంది.
ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న ప్రజలు
► గ్రామాల్లో పారిశుధ్య పనుల్ని జీవీఎంసీ ముమ్మరం చేసింది.పిచ్చి మొక్కలు, మూగజీవాల కళేబరాల్ని తొలగించారు. రహదారులు, వీధుల్ని, మురుగు కాల్వల్ని శుభ్రం చేశారు.
► గ్రామాల్లో ఎయిర్ లెవల్ క్వాలిటీని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు 3 భెల్ మిస్టర్ యంత్రాలతో నీటిని పిచికారీ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. బ్లీచింగ్ చల్లి గ్రామాల్లో పారిశుధ్యం మెరుగయ్యేలా చర్యలు తీసుకున్నారు.
► మరోవైపు పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఒక్కొక్కరుగా గ్రామాల్లోకి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.
పీటీబీసీ తీసుకొచ్చేందుకు అనుమతివ్వండి
స్టైరీన్ లీకేజీని అరికట్టేందుకు అవసరమైన రసాయనాల్ని తీసుకొచ్చేందుకు అనుమతి కోరుతూ ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. డామన్ విమానాశ్రయం నుంచి వెయ్యి కిలోల పారా టెరిటరీ బ్యూటైల్ కాటేకాల్(పీటీబీసీ)ని, కాండ్లా నుంచి 3,600 కిలోల పాలిమరైజేషన్ ఇన్‌హెబిటర్, 3,600 కిలోల గ్రీన్ రెటార్డర్‌ను విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతానికి పరిస్థితి నూరు శాతం అదుపులోకి వచ్చిందని.. వీటిని ముందు జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు అనుమతివ్వాలని విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment