కొలువుల కల.. నెరవేరిన వేళ  | AP Grama Sachivalayam Certificate Verification Schedule Here | Sakshi
Sakshi News home page

కొలువుల కల.. నెరవేరిన వేళ 

Published Tue, Sep 24 2019 12:33 PM | Last Updated on Tue, Sep 24 2019 12:35 PM

AP Grama Sachivalayam Certificate Verification Schedule Here - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ శేషగిరిబాబు

నిరుద్యోగుల్లో ఉద్యోగాల ఆనంద కేళి. సర్కార్‌ కొలువుల కోసం ఏళ్లతరబడి నిరీక్షించిన నిరుద్యోగుల కల.. నెరవేరిన వేళ. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నవరత్నాల అమలులో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మకంగా గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టారు.  

సాక్షి, నెల్లూరు : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక తుది ఘట్టానికి చేరింది. నోటిఫికేషన్‌ ప్రక్రియ నుంచి నియామక పత్రాల వరకు అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత జాబితా వరకూ అంతా పక్కాగా సిద్ధం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు అధికారులు రోస్టర్, రిజర్వేషన్లను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. 19 శాఖలకు చెందిన అధికారులు తమ, తమ శాఖల పరిధిలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకున్నారు. కలెక్టర్‌ శేషగిరిబాబు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. తొలి రోజు నగరంలోని రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, మెయిల్‌ ద్వారా సమాచారాన్ని పంపించారు. మొత్తం 7,814 గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తొలి రోజు 1,400 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేయనున్నారు. 1.1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్‌లెటర్లు పంపించారు.  జిల్లాలో 665 గ్రామ సచివాలయాలకు 7,814 పోస్టులకు గాను 1,17,138 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నియామక ప్రక్రియ అంతా జిల్లా పరిషత్‌ కార్యాలయం కేంద్రంగా జరుగుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులు (24, 25, 26 తేదీలు) పాటు ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుంది.

ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాల మేరకు మేరకు జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి అన్ని శాఖల అధికారులతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రోస్టర్, రిజర్వేషన్ల ప్రక్రియను ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకుని ధ్రువపత్రాల తనిఖీ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. రోస్టర్‌తో మెరిట్‌ జాబితాను సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది.

హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు 
జెడ్పీ కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బందిని నియమించారు. గ్రామాల నుంచి వచ్చే వారి సందేహాలను ఆ సిబ్బంది తీరుస్తూ ధ్రువపత్రాల పరిశీలినకు వెళ్లాల్సిన సెంటర్, అడ్రసు, తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్‌లను వివరిస్తున్నారు. 

రెండు కేంద్రాల్లో
తొలి రోజు మంగళవారం 6 రకాల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ్ర«ధువ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. రెండు పూటలా ఈ పరిశీలన జరుగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్టలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను , ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న సర్వోదయ కళాశాలలో పరిశీల కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 
తొలి రోజు ఆరు శాఖలకు..
తొలి రోజు విలేజ్‌ సెరికల్చరల్‌ అసిస్టెంట్, గ్రామ మత్స్య సహాయకులు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రొసెసింగ్‌ సెక్రటరీ, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ గ్రేడ్‌–2 పోస్టులకు దర్గామిట్టలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలిన జరుగుతుంది.  వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ గ్రేడ్‌–2,  వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ గ్రేడ్‌–2 పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో పరిశీలన జరుగుతోంది. ఇదిలా ఉండగా సెరికల్చర్‌ శాఖలో కేవలం ఇద్దరికే పోస్టులు దక్కనున్నాయి. వీరి హాల్‌ టికెట్‌ నంబర్లు 190916000058, 190516000111.  గ్రామ మత్స్య శాఖ సహాయకులకు సంబంధించి 68 మందిని, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ విభాగంలో 165 మందికి, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ గ్రేడ్‌–2 పోస్టులకు సంబంధించి 82 మందికి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీరందరికీ దర్గామిట్టలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో అర్హతల పత్రాలు పరిశీలిస్తారు. 

సర్వోదయ కళాశాలలో 
వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పోస్టుల్లో 147 మందికి, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ పోస్టుల్లో 154 మందికి  ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ఉన్న సర్వోదయ కళాశాలలో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. ఉదయం 10 గంటల నుంచే ఈ ప్రక్రియ జరుగుతోంది. 
 శనివారం రాత్రి అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచారు. సోమవారం ఆన్‌లైన్‌లో ఉంచిన మెరిట్‌ లిస్ట్‌ను జెడ్పీ, హాజరు కావాల్సిన కేంద్రాల వద్ద నోటిస్‌బోర్డులో పెట్టారు. ఆదివారం నుంచే  ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని అభ్యర్థులకు సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ను పంపారు. ఈ మెయిల్‌ ఉన్న వారికి మెయిల్‌లో సైతం సమాచారం పంపారు. 
 ఈ పరిశీలనకు సకాలంలో ఎవరైనా హాజరు కాలేకపోతే ఇంకొక అవకాశం కల్పిస్తారు. 
అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారుల నుంచి పొందడంలో ఆలస్యమైతే అలాంటి వారు ఈ రెండో చాన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 
 హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షామియానాలు తదితర కనీస వసతులు కేంద్రాల వద్ద కల్పించారు. 
25వ తేదీన..
నెల్లూరు(పొగతోట): 25వ తేదీన విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల (గ్రేడ్‌–2) ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న కాకుండా 25వ తేదీన జరుగుతుందని వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి సోమవారం  తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి 25న ఉదయం 9.00 గంటలకు పీఎన్‌ఎం హైస్కూల్‌ జెండావీధిలో పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు.అలాగే విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లకు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు సెయింట్‌ జోసఫ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హర్టికల్చర్‌ ఏడి కే ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. 

26న ఎడ్యుకేషన్, వెల్ఫేర్‌ పోస్టులకు
నెల్లూరు(వేదాయపాళెం):  సచివాలయ పోస్టుల నోటిఫికేషన్‌ పరీక్షల్లో  ఎడ్యుకేషన్, వెల్ఫేర్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సర్వోదయ కళాశాలలో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక శాఖ ఉప సంచాలకులు బి.జీవపుత్రకుమార్‌ తెలిపారు. కొండాయపాళెం గేటు సెంటర్‌లోని డీడీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి కె.రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి విద్యారాణి, సహాయ సంక్షేమాధికారులు నరసారెడ్డి, లక్ష్మీ ప్రసూన, తేజోవతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకే..
నెల్లూరు(పొగతోట) : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు రోస్టర్‌తో మెరిట్‌ జాబితాను సిద్ధం చేశామని కలెక్టర్‌ శేషగిరిబాబు తెలిపారు. తన క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నుంచి గురువారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుందని వివరించారు. ప్రస్తుతానికి మొదటి రోజు హాజరుకావాల్సిన వారి మెరిట్‌ జాబితాలను సిద్ధం చేశామని, అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారమిచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు 8 శాఖల మెరిట్‌ జాబితాలు సిద్ధమయ్యాయని వివరించారు. బుధవారం పరిశీలనకు హాజరుకావాల్సిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా రోస్టర్‌తో మెరిట్‌ జాబితాను సిద్ధం చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. జెడ్పీ కార్యాలయ కేంద్రంగా కసరత్తు జరుగుతోందన్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలో రోస్టర్‌ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేసి, అనంతరం ప్రింట్‌ తీసుకొని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు సకాలంలో అందజేసేలా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల మెరిట్‌ జాబితాను జెడ్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement