పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ! | Nellore Pedda Reddy Satirical Article On Kesineni Chinni Chandrababu | Sakshi
Sakshi News home page

పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ!

Published Sat, Jan 13 2024 3:40 PM | Last Updated on Sun, Feb 4 2024 2:51 PM

Nellore Pedda Reddy Satirical Article On Kesineni Chinni Chandrababu - Sakshi

ఓర్నాయనో.. అబ్బయ్యా సిన్నీ! మీ అన్నకి సెంద్రబాబు సీటీ సించేసే సరికి నీకు మహా కుశాలగా ఉన్నట్టుండాదే అబ్బయ్యా! ఇన్నేళ్లు సెంద్రబాబుకి ఊడిగం జేసిన మీ అన్నయ్యని మెడ బట్టుకోని బయటకి గెంటేసిన తర్వాత.. రాజ్జెమంతా నీదే అయిపోతాదని మురిసిపోతా వున్నట్టుండావు గదా. అప్పుడే నీకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేసినట్టు.. నువ్వు సైకిలెక్కి లగెత్తుకోని డిల్లీలో పార్లమెంటుకు పోయినట్టు కళ్లముందు సెవెంటీ ఎమ్మెమ్ములో కనిపిస్తా వున్నట్టుండాది గదా!

అంతేలే అబ్బయ్యా.. యీ మాదిర్తో అరసేతిలో సొర్గాన్ని జూపించకపోతే.. ఆ సెంద్రబాబు మాత్తరం పార్టీని ఎట్టా నడుపుకుంటాళ్లే? యీ కలలు కొంచిం కట్టిపెట్టి.. నా మాటలు కొంచిం జాగర్తగా ఆలకించుకో అబ్బయ్యా! మీ అన్నకైనా నెత్తిన పదేళ్లు కిరీటం నిలబడినాది. నీ కాడికి వొస్తే.. అసలు ఎలచ్చను గంట మోగడానికి ముందుగాలే.. నీ సీటీ సిరిగిపొతాదేమో అని అనుమానంగా వుండాదబ్బయ్యా.. ఎట్టాగంటవా? అదే జెప్పబోతన్నా.. రొవ్వంత జాగర్తగా యినుకో!

సెంద్రబాబు మీ అన్న నాని మీద పగబట్టినట్టుగా గెంటేసినాక ఏదో జగనన్న పంచన జేరినాడనుకో. అదాటుగా నువు సీన్లోకి బలే ఎంట్రీ ఇచ్చినావబ్బయ్యా! మా అన్న రెండు సార్లు గెలిస్తే.. అసలు ఆ ఎలచ్చన్లలో పన్జేసి గెలిపించింది నేనే అంటావుంటివి. ఏమోనబ్బా.. మా నెల్లూరు మీ బెజవాడకి శానా దూరం గదా. అందుకేగావాల నీ పేరు యిదివరలో యినబడలా! సరే, ‘గెలుపు  అనే బిడ్డకి శానా మంది నాయినలుంటారని’ ఇంగ్లీసులో ఓ సామెతుండాదిలే.

ఆ మాదిరిగా మీ అన్నయ్య గెలిస్తే అంతా నీ పెతాపమే అని జెప్పుకుంటా వుండావు. ఓకే! అన్నయ్యని బయటకి పంపేయగానే.. సెంద్రబాబుకు వత్తాసు ఏసుకోని శానా దుడుకు మాటలు అంటావుండావు. మీ అన్న నానికి అంత సీన్లేదని అంటావుండావు. ఆయన లేడు గనక.. బెజవాడ సీటుని నీ సేతుల్లో యేలుకో తమ్ముడా అని సెంద్రబాబు అనబోతాడని నీకు ఆసె గదా. ఆయన గొప్పదనం గూడా యిట్టాంటి ఆసెలు పుట్టించడమే గదా? మరైతే సీక్రేటు జెప్తా యిను..

సుజనా సౌదరి అనే పెద్దమడిసి నీకు ఎరుకే గదా! మీ సెంద్రబాబు తోలితేనే గదా ఆయన పొయ్యి పువ్వు పార్టీలో గూసోని ఆణ్నించి రాజకీయం జేస్తన్నాడు. ఆయనకీ సెంద్రబాబుకీ ఉండే బందం పైకి కనపడకపొయినా సరే.. ఫెవికాల్తో అతికించినదానికంటె గట్టిదేననే సంగతి నీగ్గూడా తెలుసు గదా. మరి తాజా తాజా కబుర్లు నీ సెవిలో పడినాయో లేదో! ఆ సుజనా సౌదరి అనే పెద్దమడిసి బెజవాడ ఎంపీ సీటు మీద కన్నేసినాడంట. ఎటూ పువ్వు పార్టీలో ఉన్నాడు గాబట్టి.. పువ్వు టిక్కెట్టు మీదనే పోటీ జేస్తాడనుకో… నీకు యిప్పుటికిప్పుడు అడ్డం రాబోయేదేమీ లే. కాపోతే.. పువ్వుతో సైకిలుకి, గాజుగ్లాసుకి ముడిపడతాదేమో అని కూడా ఆయనే లీకులు వదలతండాడు అబ్బయ్యా సిన్నీ! యినుకున్నావా??

అదేగానీ జరిగిందనుకో.. ఎంపీల వరకు గెలిసే సీట్లే గావాలని పువ్వు పార్టీవోళ్లు ఫిటింగు బెట్టకుండా వుంటారా? ఆముడి పడినా బెజవాడ పువ్వుకే సమర్పయామి అయిపోతాది. అప్పుడిక నీ బతుకు మూడుజెండాలు బుజాన యేస్కోని మళ్లీ వూరంతా తిరగతా వుండడమే. నీకొక దారీ దిక్కూ యెప్పుటికి దక్కతాదో యెవురికెరుక అబ్బయ్యా!

ఒకేళ- పువ్వుతో సైకిలుకు ముడిపడలేదే అనుకో.. నీ బతుకు యింకా కనాగస్టంగా అయిపోతా దబ్బయ్యా! సెంద్రబాబు ఒక సేత్తో నీకు టికెటిస్తాడనుకుందాం. రెండో సేత్తో- రెండో కంటికి తెలీకుండా నీ యెనకాల గొయ్యి కూడా తవ్విపెడతాడు! గోయిందా గోయింద!

‘సీసీ.. అట్టా యెందుకు జేస్తాడు’ అని గీర మాటలు మాటాడబోక నాయినా! అదే మరి సెంద్రబాబు మంత్రాగం. నీలాంటోడు ఆయన్ని నమ్ముకోని యెప్పుటికీ యీ పంచనే పడుంటాడు. కానీ.. పువ్వు పార్టీలోకి సెంద్రబాబు సొరబెట్టిన సుజనా సౌదరి లాంటి పెద్దమడిసి గెలిస్తే.. ఢిల్లీలో గూసోని బాబు గారి పన్లన్నీ గుట్టుసప్పుడు గాకుండా సక్కబెడతా వుంటాడు గదా! అదొక్కటే యేముండాదిలే. లోపల్లోపల ఆ సౌదరికీ- సెంద్రబాబుకీ యెన్నిన్ని లుకలుకల బందాలుండాయో నేను నీకు జెప్పాల్నా అబ్బయ్యా..! నెల్లూరోణ్ని- నాకంటే.. బెజవాడోడివి- నీకే యిట్టాంటి లోగుట్టు కతలు మాబాగా తెలస్తాయి. కాదంటావా?

కాబట్టి నాయినా సిన్నీ! అన్నియ్య పొయినాడని.. యిక రాజ్జెమంతా నువ్వే యేలుకోవచ్చునని మురిసిపోబాక. మిడిసిపడబోక. ‘యెన్నాల్లో యేసిన వుదయం.. ఇయ్యాలే ఎదురవుతోంటే..’ అని సాంగులూ గట్రా యేసుకోని పండగజేసుకోబాక. సెంద్రనీతి రాజకీయాల్లో యింకా యెన్నెన్ని టర్నింగులుండాయో.. యెన్నెన్ని లోయలుండాయో.. నీ కలలబండి యేడ కూలిపోబోతాదో.. తెలవదు గదా! అందుకే రొవ్వంత జాగర్తగా పో అబ్బయ్యా! యింకా నాకు తిరుగు లేదని యిసురుకుంటా తిరిగినావనుకో.. అన్నకు జేసిన  మాదిరిగానే సెంద్రబాబు నీ సీటీ గూడా అవలీలగా సించేయగల్డు!

✍️నెల్లూరు పెద్దారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement