
సాక్షి, అమరావతి : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈ చిత్ర విడుదలను ఏపీ హైకోర్టు నిలిపివేసింది. ఏప్రిల్ మూడో తేదీ వరకు ఈ సినిమాను నిలిపివేసింది. ఏప్రిల్ మూడో తేదీ సాయంత్రం 4గంటలకు హైకోర్టు జడ్జి చాంబర్‌లోన్యాయవాదుల సమక్షంలో చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. సినిమాను వీక్షించాకే తుది తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్ర నిర్మాత ప్రివ్యూకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
సెన్సార్ బోర్డ్ ఒకసారి అనుమతించాక అడ్డు చెప్పడానికి వీలు ఉండదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. పద్మావతి సినిమా రిలీజ్‌పై సుప్రీం కోర్ట్ ఆదేశాలను ప్రస్తావించి.. తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతించిన విషయాన్ని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు.