ఏకీకృత ఫీజుపై 3 వారాల్లో నిర్ణయం తీసుకోండి
* ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు కేటగిరిలతో ప్రమేయం లేకుండా (ఎన్నారై కోటా మినహా) ఏకీకృత ఫీజు నిర్ణయించే అంశంపై ఇనాందార్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సభ్య కార్యదర్శి, వైద్య-ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం తమంతట తాము ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించుకుంటామని కోరుతున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే విషయంలో కూడా రెండు వారాల్లో నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు నాలుగు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి వస్తే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2014-15 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్లను భర్తీ చేసే సమయంలో యాజమాన్యం, కన్వీనర్ కోటాలంటూ వర్గీకరించకుండా (ఎన్నారై కోటా మినహా) అన్ని కోర్సులకు ఏకీకృత ఫీజును ఖరారు చేసేలా ఏఎఫ్‌ఆర్‌సీ, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు విచారించారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రైవేటు కాలేజీల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని, అంతేకాక సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించుకుని ప్రవేశాలు చేపట్టుకోవచ్చునంటూ టీఎంఏ పాయ్, పి.ఎ.ఇనాందార్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నారై కోటా మినహా మిగిలిన అన్ని కేటగిరిలకు ఒకే ఫీజు ఉండాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, అయితే వైద్య కళాశాలల్లో ప్రవేశాల విషయంలో ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయట్లేదని నివేదించారు. ఏటా ప్రవేశాల సమయంలో ప్రభుత్వం ఆయా యాజమాన్యాల సంఘాన్ని ఏదో రకంగా భయపెట్టి, వేర్వేరు ఫీజుల విధానాన్ని అమలు చేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మోహన్‌రెడ్డి వివరించారు.
2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులను ఖరారు చేసేందుకు ఆదాయ, వ్యయాల వివరాలను ఇవ్వాలని ఆయా కాలేజీలను ఏఎఫ్‌ఆర్‌సీ కోరిందని, అయితే ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజుల ఖరారుతో సంబంధం లేని వివరాలను కోరిందని, ఇది కాలేజీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విన్నవించారు. అంతేకాక కాలేజీలన్నీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ఉమ్మడి ప్రవేశ పరీక్ష విషయంలో వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరగా, తాము సమావేశం నిర్వహించుకుని విధి విధానాలను ఖరారు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
దీంతో ఏకీకృత ఫీజు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ 3వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్ష విషయంలో రెండు వారాల్లో మార్గదర్శకాలు, విధి విధానాలపై నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.