common fees
-
బీసీ విద్యార్థులకు కామన్ ఫీజు గండం
ఎచ్చెర్ల క్యాంపస్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అమలుచేస్తున్న నిబంధనలు బీసీ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. పదివేల ర్యాంకు దాటి న విద్యార్థులు కామన్ ఫీజు స్ట్రక్చర్ దాటిన కళాశాలలో చేరితే అదనపు ఫీజు భరించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం కామన్ ఫీజుతో సంబంధంలేకుండా మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా ఇదే నిబంధన అమలుచేస్తారా, మార్పుచేసి న్యాయం చేస్తారా అన్న సందిగ్ధం విద్యార్థుల్లో నెల కొంది. పస్తుతం జిల్లాలోని కళాశా లల ను ఉదాహరణగా తీసుకుంటే రాష్ట్ర ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన ఫీజు రూ .35 వేలు కాగా రాజాం సమీపంలోని జీఎంఆర్ ఐటీలో రూ.80,400, టెక్కలి సమీపంలోని ఐతంలో రూ.68,000 పీజు స్ట్రక్చర్ ఉంది. మిగతా ఆరు కళాశాలల్లో కామన్ ఫీజ్‌కు అటుగా, ఇటుగా ఫీజు ఉంది. 10 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు ఈ కళాశాల్లో చేరితే అదనపు ఫీజు భ రించాల్సి వస్తోంది. దీంతో ఈ ఫీజు చెల్లించే సామర్థ్యం లేని విద్యార్థులు కామన్ ఫీజు కళాశాలలను ఎంపిక చేసుకోవలసి వస్తోంది. ఇతర జిల్లాల్లో రూ.లక్ష దాటి ఫీజు స్ట్రక్చర్ ఉన్న కళాశాలలు కూడా ఉన్నాయి. ఇటు వంటి కళాశాలల్లో విద్యార్థులు చేరితే కామన్ ఫీజు మినహాయించి రూ.65 వేలు విద్యార్థులు బరించ వల్సి ఉంటుంది. కామన్ ఫీజు కంటే ఎక్కువ సొమ్మును విద్యార్థులు ఫీజురూపంలో చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోతున్న జిల్లా విద్యార్థులు జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ. దీంతో పాటు బీసీలు ఎక్కువ. విషయ పరిజ్ఞానం ఉన్నా మొదటి ప్రయత్నంలో పట్టణ ప్రాంతాల విద్యార్థులతో పోటీ పడి ర్యాంకు సాధించడం సాధ్యం కాదు. ఈ నేపధ్యంలో మన జిల్లా విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. మరోవైపు 10 వేలు ర్యాంకు లోపు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ సంస్థల్లో, యూనివర్సిటీల్లో చేరే వీలుంటుంది. ఈ ఏడాది మన జిల్లా నుంచి 4,850 మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరు కాగా, 10 వేలు లోపు ర్యాంకులు సాధించిన వారు 1000 లోపు ఉంటారని అంచనా. 10 నుంచి 20 వేలు మధ్య ర్యాంకు సాధించిన వారు 3 వేలు దాటి ఉంటారు. వీరందరూ ర్యాంక్ సీలింగ్ నిబంధన వల్ల కామన్ ఫీజు స్ట్రక్చర్ దాటి ఉన్న కళాశాలలను మిస్ అవుతున్నారు. ఈ ఏడాది నిబంధనలు సడలించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మెంట్‌పై స్పష్టత కరువు ఇప్పటికే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్ మెంట్‌పై ఎలాంటి స్పష్టత తెలపలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ అమల్లో మార్పులు చేస్తుందా? పాత విధానాన్నే అమలు చేస్తుందా? అన్న సందిగ్ధం నెలకొంది. విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం ర్యాంక్ సీలింగ్ వల్ల విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించక కామన్ ఫీజ్ కళాశాలలు ఎంచుకోవాల్సి వస్తోంది. ర్యాంకులతో ఫీజు రీయింబర్స్‌మెంట ముడిపెట్టటం కంటే సీటు లభించిన కళాశాల బట్టి ఫీజులు చెల్లించే నిబంధన అమలుచేస్తే మంచిది. 10 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులకు ప్రతిభ లేనట్లు చెప్పలేం. మెరుగైన కళాశాల్లో చేరితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు సైతం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. -ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ -
ఎంబీబీఎస్ కామన్ ఫీజుపై కోర్టుకు!
ఏఎఫ్ఆర్సీ నిర్ణయంపై ప్రైవేటు మెడికల్ కాలేజీల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సుకు ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమి టీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన కామన్ ఫీజుపై ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నాయి. కొన్ని రోజులుగా కామన్ ఫీజుపై కసరత్తు చేసిన ఏఎఫ్ఆర్సీ.. ఎంబీబీఎస్ కోర్సులో ఏడాదికి రూ. 3.10 లక్షల నుంచి రూ. 3.75 లక్షల వరకూ ఫీజు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చింది. కాలేజీలో వసతులను బట్టి గరిష్టంగా రూ. 3.75 లక్షలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదని నివేదికలో పేర్కొంది. దీనిపై రెండ్రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాలేజీల నిర్వహణ భారం పెరిగిం దని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కళాశాల గ్రేడును బట్టి ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఫీజు ఉండేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలు డిమాం డ్ చేశాయి. ఇలాగైతే తాము ప్రైవేటు పరీక్షకైనా, ప్రభుత్వమే ప్రవేశపరీక్ష నిర్వహించి సీట్లు భర్తీ చేసినా తమకేమీ అభ్యంతరం లేదని తెలిపాయి. అయితే ఏఎఫ్ఆర్సీ గరిష్టం గా రూ. 3.75 లక్షలే ఫీజుగా నిర్ణయించడంతో ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తామని ఓ మెడికల్ కాలేజీ యాజమాన్య ప్రతినిధి తెలిపారు. ఒకవేళ యాజ మాన్యాలు కోర్టుకెళితే పాత పద్ధతి ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించే పరిస్థితి వస్తుంది. అంటే అవి తమ ఇష్టానుసారం సీట్లను భర్తీ చేసుకోవచ్చు. -
నిబంధనలు మారకుంటే నష్టం తప్పదు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సజావుగా ముగిసింది. ర్యాంకుల ప్రకటనకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తి చేసి ఆగస్టు మొదటి వారం నాటికి ప్రవేశాలు పూర్తి చేసి విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ సారికి రాష్ట్రం యూనిట్‌గా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ నేపధ్యంలో పాతపద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తారా.. మార్పు ఉంటుందా అన్నది చర్చనీయూంశంగా మారింది. పాతపద్ధతిలో అయితే జిల్లా విద్యార్థులకు నష్టం తప్పదని విద్యానిపుణులు చెబుతున్నారు. గతంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో కామన్ ఫీజు అమలయ్యేది. అయితే, తమ కళాశాలల్లోని సౌకర్యాలు, వసతులకు అనుగుణంగా ఫీజులు లేవని, తాము నష్ట పోతున్నామని పలు కళాశాలల యూజమాన్యాలు కోర్టును ఆశ్రరుుంచారుు. న్యాయస్థానాల ఆదేశాలు మేరకు ప్రభుత్వం ప్రవేటు కళాశాలు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు ఆధారంగా ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించేందుకు టాస్క్ ఫోర్సు బృందాలను నియమించింది. ఈ బృందాలు సమర్పించిన నివేదిక ఆధారంగా కళాశాలలకు ఫీజులు నిర్ణయించింది. 2012 నుంచి కళాశాలల మధ్య ఫీజుల వ్యత్యాసాలు ఎక్కువగా వచ్చాయి. రాష్ట్రంలో కామన్ ఫీజు రూ.35 వేలు కాగా, సీబీఐటీ, విశ్వభారతి వంటి పట్టణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు రూ.లక్ష దాటి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్సు మెంట్ విషయంలో సీలింగ్ అమలు చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మినహాయించిన ప్రభుత్వం బీసీ, ఓబీసీల విషయంలో సీలింగ్ విధించింది. 10 వేల లోపు ర్యాంకు వచ్చి, ఆదాయ పరిమితి ఉండే విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయి ఫీజు చెల్లిస్తోంది. 10 వేలు ర్యాంకు దాటి వచ్చిన విద్యార్థి ఏ కళాశాలలో చేరినా కామన్ ఫీజు రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుంది. దీంతో విద్యార్థులు నచ్చిన కళాశాలలో చేరాలంటే అదనపు భారం తప్పదు. ఆర్థిక స్థోమతలేని గ్రామీణ ప్రాంత విద్యార్థులు 10 వేలు ర్యాంకు దాటివస్తే కామన్ ఫీజు కాలేజీలనే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. ఫీజు స్ట్రక్చర్ ఎక్కువగా ఉన్న పేరున్న కళాశాలల్లో చేరలేక కమ్యూనికేషన్స్ స్కిల్స్‌లో వెనుకబడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. 10 వేల ర్యాంకు సీలింగ్ మిగతా ప్రాంతాలతో చూస్తే మన జిల్లా విద్యార్థులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ర్యాంకులవారీగా చూస్తే... జిల్లాలో ఐదువేల ర్యాంకు లోపు వారు 90 నుంచి 150 మధ్యన, ఐదు నుంచి 10 వేలలోపు ర్యాంకు వారు 250 నుంచి 350 వరకు ఉంటున్నారు. వీరికి రిజర్వేషన్ ప్రాతిపదిక ప్రభుత్వ క్యాంపస్‌లు, వర్సిటీల్లో సీట్లు వస్తున్నాయి. 10 వేల నుంచి 30 వేల మధ్య ర్యాంకులను దాదాపుగా 1000 మంది విద్యార్థుల పొందుతున్నారు. రీయింబర్స్మెంట్ సీలింగ్ విధానంతో వీరంతా నష్టపోతున్నారు. రిజర్వేషన్ ఆధారంగా మంచి కళాశాలల్లో సీటు వచ్చే అవకాశం ఉన్నా పేదరికం కారణంగా కామన్ ఫీజ్ స్ట్రక్చర్ కళాశాలలనే ఎంచుకోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో 10 ఇంజనీరింగ్ కళాశాలు ఉన్నా గత రెండేళ్ల నుంచి కనీస అడ్మిషన్లు లేక రెండు కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరం గా ఉంటున్నాయి. ఎనిమిది కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. రాజాం జీఎంఆర్ ఐటీ ఫీజు రూ. 85 వేలు కాగా, టెక్కలి ఐతం ఫీజు రూ.65 వేలు ఉంది. మిగతా కళాశాలు కామన్ ఫీజుకు దాదాపుగా పెద్దగా వ్యత్యాసం లేదు. 10 వేల ర్యాంకు దాటిన విద్యార్థులు ఈ రెండు కళాశాలల్లో చేరాలంటే మాత్రం అదనపు ఫీజు రూ.50 నుంచి రూ.30 వేలు భరించాల్సి వస్తోంది. పేద విద్యార్థులకు అన్యాయం ప్రభుత్వం పూర్తిస్థాయి వసతులు ఉంటేనే కళాశాలల నిర్వహణకు అనుమతి ఇవ్వాలి. కామన్ ఫీజునే అమలు చేయూలి. ఇంజినీరింగ్ విద్యలో బోధన, మౌలిక సౌకర్యాలు రేండూ కీలకమే. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఒకేసారి ఎంసెట్‌లో పదివేలు లోపు ర్యాంకు సాధించడం కష్టం. ర్యాంకు కూడా ప్రతిభకు ప్రామాణికంగా చెప్పలేం. విద్యార్థి రిజర్వేషన్ ర్యాంకును బట్టి నచ్చిన కళాశాల ఎంచుకునే అవకాశం కల్పించాలి. రీయింబర్స్మెంట్ సీలింగ్ వల్ల పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.ప్రభుత్వం తప్పనిసరిగా రీయింబర్స్మెంట్ అమలుపై పునఃసమీక్షించుకోవాలి. -ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ -
ఏకీకృత ఫీజుపై సర్కారుకు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లకు ఏకీకృత ఫీజు (కామన్ ఫీజు)పై గురువారం ఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్స్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వైద్య కళాశాలల్లో వసతులను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకూ ఫీజులను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు మాత్రం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు ఫీజులు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. వారం రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుని జీవో జారీ చేస్తారు. ఈ ఏడాది నుంచే ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఏకీకృత ఫీజు అమల్లోకి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్లు దక్కుతాయి. ఇకపై కన్వీనర్ కోటా, బీ కేటగిరీ కోటా ఉండవు. ప్రవాస భారతీయ కోటా సీట్లు మాత్రం ఆయా వైద్య కళాశాలలే నేరుగా సీట్లు భర్తీ చేసుకుంటాయి. -
ఏకీకృత ఫీజుపై 3 వారాల్లో నిర్ణయం తీసుకోండి
* ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు కేటగిరిలతో ప్రమేయం లేకుండా (ఎన్నారై కోటా మినహా) ఏకీకృత ఫీజు నిర్ణయించే అంశంపై ఇనాందార్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సభ్య కార్యదర్శి, వైద్య-ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం తమంతట తాము ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించుకుంటామని కోరుతున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే విషయంలో కూడా రెండు వారాల్లో నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు నాలుగు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి వస్తే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2014-15 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్లను భర్తీ చేసే సమయంలో యాజమాన్యం, కన్వీనర్ కోటాలంటూ వర్గీకరించకుండా (ఎన్నారై కోటా మినహా) అన్ని కోర్సులకు ఏకీకృత ఫీజును ఖరారు చేసేలా ఏఎఫ్ఆర్సీ, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రైవేటు కాలేజీల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని, అంతేకాక సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించుకుని ప్రవేశాలు చేపట్టుకోవచ్చునంటూ టీఎంఏ పాయ్, పి.ఎ.ఇనాందార్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నారై కోటా మినహా మిగిలిన అన్ని కేటగిరిలకు ఒకే ఫీజు ఉండాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, అయితే వైద్య కళాశాలల్లో ప్రవేశాల విషయంలో ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయట్లేదని నివేదించారు. ఏటా ప్రవేశాల సమయంలో ప్రభుత్వం ఆయా యాజమాన్యాల సంఘాన్ని ఏదో రకంగా భయపెట్టి, వేర్వేరు ఫీజుల విధానాన్ని అమలు చేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మోహన్‌రెడ్డి వివరించారు. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులను ఖరారు చేసేందుకు ఆదాయ, వ్యయాల వివరాలను ఇవ్వాలని ఆయా కాలేజీలను ఏఎఫ్ఆర్సీ కోరిందని, అయితే ఏఎఫ్ఆర్సీ ఫీజుల ఖరారుతో సంబంధం లేని వివరాలను కోరిందని, ఇది కాలేజీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విన్నవించారు. అంతేకాక కాలేజీలన్నీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ఉమ్మడి ప్రవేశ పరీక్ష విషయంలో వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరగా, తాము సమావేశం నిర్వహించుకుని విధి విధానాలను ఖరారు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో ఏకీకృత ఫీజు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ 3వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్ష విషయంలో రెండు వారాల్లో మార్గదర్శకాలు, విధి విధానాలపై నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.