నిబంధనలు మారకుంటే నష్టం తప్పదు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సజావుగా ముగిసింది. ర్యాంకుల ప్రకటనకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తి చేసి ఆగస్టు మొదటి వారం నాటికి ప్రవేశాలు పూర్తి చేసి విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ సారికి రాష్ట్రం యూనిట్‌గా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ నేపధ్యంలో పాతపద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తారా.. మార్పు ఉంటుందా అన్నది చర్చనీయూంశంగా మారింది. పాతపద్ధతిలో అయితే జిల్లా విద్యార్థులకు నష్టం తప్పదని విద్యానిపుణులు చెబుతున్నారు.
గతంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో కామన్ ఫీజు అమలయ్యేది. అయితే, తమ కళాశాలల్లోని సౌకర్యాలు, వసతులకు అనుగుణంగా ఫీజులు లేవని, తాము నష్ట పోతున్నామని పలు కళాశాలల యూజమాన్యాలు కోర్టును ఆశ్రరుుంచారుు. న్యాయస్థానాల ఆదేశాలు మేరకు ప్రభుత్వం ప్రవేటు కళాశాలు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు ఆధారంగా ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించేందుకు టాస్క్ ఫోర్సు బృందాలను నియమించింది. ఈ బృందాలు సమర్పించిన నివేదిక ఆధారంగా కళాశాలలకు ఫీజులు నిర్ణయించింది. 2012 నుంచి కళాశాలల మధ్య ఫీజుల వ్యత్యాసాలు ఎక్కువగా వచ్చాయి. రాష్ట్రంలో కామన్ ఫీజు రూ.35 వేలు కాగా, సీబీఐటీ, విశ్వభారతి వంటి పట్టణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు రూ.లక్ష దాటి ఉన్నాయి.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్సు మెంట్ విషయంలో సీలింగ్ అమలు చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మినహాయించిన ప్రభుత్వం బీసీ, ఓబీసీల విషయంలో సీలింగ్ విధించింది. 10 వేల లోపు ర్యాంకు వచ్చి, ఆదాయ పరిమితి ఉండే విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయి ఫీజు చెల్లిస్తోంది. 10 వేలు ర్యాంకు దాటి వచ్చిన విద్యార్థి ఏ కళాశాలలో చేరినా కామన్ ఫీజు రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుంది. దీంతో విద్యార్థులు నచ్చిన కళాశాలలో చేరాలంటే అదనపు భారం తప్పదు. ఆర్థిక స్థోమతలేని గ్రామీణ ప్రాంత విద్యార్థులు 10 వేలు ర్యాంకు దాటివస్తే కామన్ ఫీజు కాలేజీలనే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. ఫీజు స్ట్రక్చర్ ఎక్కువగా ఉన్న పేరున్న కళాశాలల్లో చేరలేక కమ్యూనికేషన్స్ స్కిల్స్‌లో వెనుకబడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. 10 వేల ర్యాంకు సీలింగ్ మిగతా ప్రాంతాలతో చూస్తే మన జిల్లా విద్యార్థులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
ర్యాంకులవారీగా చూస్తే...
జిల్లాలో ఐదువేల ర్యాంకు లోపు వారు 90 నుంచి 150 మధ్యన, ఐదు నుంచి 10 వేలలోపు ర్యాంకు వారు 250 నుంచి 350 వరకు ఉంటున్నారు. వీరికి రిజర్వేషన్ ప్రాతిపదిక ప్రభుత్వ క్యాంపస్‌లు, వర్సిటీల్లో సీట్లు వస్తున్నాయి. 10 వేల నుంచి 30 వేల మధ్య ర్యాంకులను దాదాపుగా 1000 మంది విద్యార్థుల పొందుతున్నారు. రీయింబర్స్‌మెంట్ సీలింగ్ విధానంతో వీరంతా నష్టపోతున్నారు. రిజర్వేషన్ ఆధారంగా మంచి కళాశాలల్లో సీటు వచ్చే అవకాశం ఉన్నా పేదరికం కారణంగా కామన్ ఫీజ్ స్ట్రక్చర్ కళాశాలలనే ఎంచుకోవాల్సి వస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
జిల్లాలో 10 ఇంజనీరింగ్ కళాశాలు ఉన్నా గత రెండేళ్ల నుంచి కనీస అడ్మిషన్లు లేక రెండు కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరం గా ఉంటున్నాయి. ఎనిమిది కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. రాజాం జీఎంఆర్ ఐటీ ఫీజు రూ. 85 వేలు కాగా, టెక్కలి ఐతం ఫీజు రూ.65 వేలు ఉంది. మిగతా కళాశాలు కామన్ ఫీజుకు దాదాపుగా పెద్దగా వ్యత్యాసం లేదు. 10 వేల ర్యాంకు దాటిన విద్యార్థులు ఈ రెండు కళాశాలల్లో చేరాలంటే మాత్రం అదనపు ఫీజు రూ.50 నుంచి రూ.30 వేలు భరించాల్సి వస్తోంది.
పేద విద్యార్థులకు అన్యాయం
ప్రభుత్వం పూర్తిస్థాయి వసతులు ఉంటేనే కళాశాలల నిర్వహణకు అనుమతి ఇవ్వాలి. కామన్ ఫీజునే అమలు చేయూలి. ఇంజినీరింగ్ విద్యలో బోధన, మౌలిక సౌకర్యాలు రేండూ కీలకమే. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఒకేసారి ఎంసెట్‌లో పదివేలు లోపు ర్యాంకు సాధించడం కష్టం. ర్యాంకు కూడా ప్రతిభకు ప్రామాణికంగా చెప్పలేం. విద్యార్థి రిజర్వేషన్ ర్యాంకును బట్టి నచ్చిన కళాశాల ఎంచుకునే అవకాశం కల్పించాలి. రీయింబర్స్‌మెంట్ సీలింగ్ వల్ల పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.ప్రభుత్వం తప్పనిసరిగా రీయింబర్స్‌మెంట్ అమలుపై పునఃసమీక్షించుకోవాలి.
-ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ