సాక్షి, అమరావతి: పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు గరిష్టంగా 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. 50 శాతంపైగా రిజర్వేషన్లను ఎలా సమర్ధించుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల నిలుపుదలకు ఉత్తర్వులివ్వలేం..
పంచాయతీ ఎన్నికల్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 34 శాతం మేర అమలు చేస్తున్న రిజర్వేషన్లతో మొత్తం 50 శాతం దాటుతున్నాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కె.నవీన్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 50 శాతం దాటి రిజర్వేషన్లు కల్పించేందుకు అనుమతిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేశారు.
పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసేంత వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, సుప్రీంకోర్టు నిర్ధేశించిన రిజర్వేషన్ల పరిమితి మేర ఎన్నికలు ఎలా నిర్వహించాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్నారు. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉందని, ఈ విషయాన్ని గురువారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు.
రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై మీ వైఖరేంటి?
Published Sat, Nov 16 2019 4:18 AM | Last Updated on Sat, Nov 16 2019 4:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment