సాక్షి, అమరావతి: ఏపీలో ఇప్పటి వరకు ఒక్క ‘కోవిడ్-19’ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైరస్ (కోవిడ్-19) నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 466 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 234 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 226 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 36 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 34 మందికి నెగిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఇద్దరి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. (కరోనా ఎఫెక్ట్.. దేవుని విగ్రహాలకు మాస్క్‌లు)
ఆందోళన వద్దు..
కోవిడ్-19 వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారన్ని నమ్మొద్దని ప్రజలకు జవహర్‌రెడ్డి సూచించారు. కరోనా వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించామని తెలిపారు. అధిక ధరలకు మాస్క్‌లు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో మాస్క్‌లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. లైన్ డిపార్ట్‌మెంట్‌లోని నోడల్ అధికారులందరితో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. వైరస్ నిరోధక చర్యల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కోవిడ్-19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు( 0866-2410978)కి తెలియజేయాలన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. వైద్య సలహాల కోసం 104 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. (ఆ 33 మందికీ 'కరోనా' లేదు..)
Comments
Please login to add a commentAdd a comment