సాక్షి, గుంటూరు: అవినీతిని వెలికి తీసి వార్తలు రాశాడని కక్ష గట్టారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. తన ఇంటిలో జరిగిన దొంగతనాన్ని సైతం రాజకీయంగా వాడుకుని సొమ్ము రికవరీ కాకుండా చేశారు. చివరకు భౌతిక దాడులకూ తెగబడ్డారు. జర్నలిజం నుంచి పక్కకు తప్పుకున్నా వారి కసి తీరలేదు. అతని బంధువులకు చెందిన ఎనిమిది ఎకరాల పొలంలో తమ అనుచరుల చేత దౌర్జన్యంగా గ్రావెల్ క్వారీ తవ్వించారు. ఇదీ సోమవారం చిలకలూరిపేటలో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్‌పై కొనసాగిన వేధింపుల పర్వం. చచ్చే వరకూ వెంటాడి వేధించారని విలేకరి కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఆయన భార్య వేధింపుల వల్లే మాజీ విలేకరి బలయ్యాడన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పురుగు మందు తాగి మాజీ విలేకరి ఆత్మహత్య
మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్ (40) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన సురేంద్రనాథ్ సోమవారం చిలకలూరిపేటలోని ఓ లాడ్జి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి గదిలో కూల్‌డ్రింక్ సీసా, పురుగుమందు డబ్బాను గుర్తించారు. సురేంద్రనాథ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, సురేంద్రనాథ్ భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
అక్రమాలు వెలికితీశాడనే
సురేంద్రనాథ్ రెండేళ్ల క్రితం సాక్షి, అంతకు ముందు ఆంధ్రజ్యోతి, ఇతర పత్రికల్లో విలేకరిగా పనిచేశాడు. చిలకలూరిపేట, యడ్లపాడులో విధులు నిర్వర్తించాడు. ఓ మంత్రి భార్య కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంతోపాటు వారి దౌర్జన్యాలు, అవినీతి వ్యవహారాలపై వార్తలు రాశాడు. విలేకరిగా పనిచేస్తున్నప్పుడు ఆయన యడ్లపాడు వంతెన వద్ద రాత్రి సమయంలో ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. సురేంద్రనాథ్ ఆర్థిక వనరులపై మంత్రి అనుచరులు దృష్టి సారించడంతో ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. యడ్లపాడు మండలంలో తన బంధువుల పేరిట కొనుగోలు చేసిన ఎనిమిది ఎకరాల భూమిలో ఇటీవల మంత్రి అనుచరులు గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఇదే భూమిని ఇతరులకు విక్రయించేందుకు సురేంద్ర అడ్వాన్స్‌లు తీసుకున్నట్లు సమాచారం. ఈ భూమిని మంత్రి అనుచరులు తవ్వేయడంతో చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని భూమి కొన్నవారు ఒత్తిడి చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
రౌడీషీట్ వెనుక మంత్రి హస్తం
గతంలో విలేకరిగా పనిచేస్తున్న సమయంలోనే యడ్లపాడులో చికెన్ స్టాల్ వద్ద జరిగిన చిన్నపాటి వివాదంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి సురేంద్రనాథ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమెదు చేయించారు. ఇదే కేసులో సాక్షులను బెదిరించినట్లు మరో కేసు బనాయించారు. ఈ రెండు కేసుల ఆధారంగా యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ తెరిపించారు. ఎలాంటి నేరచరిత్ర లేకున్నా రౌడీషీట్ తెరవడం వెనుక మంత్రి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సురేంద్రనాథ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన వారు తర్వాత పట్టుబడినా పోలీసులు ఎలాంటి రికవరీ చేయలేదు. వ్యభిచారంపై వార్త రాయడంతో మంత్రి సన్నిహితురాలైన ఓ మహిళా ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో సురేంద్రనాథ్ ఇంటి వద్ద ఆందోళన చేయించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment