జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం | ap police misbehaved with opposition leader ys jagan mohan reddy at vizag airport | Sakshi
Sakshi News home page

జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం

Published Thu, Jan 26 2017 6:01 PM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం - Sakshi

జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం

కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయంలోకి కూడా అనుమతించకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి ఇక్కడకు చేరుకున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయం లోనికి కూడా అనుమతించకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పార్టీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, నాయకులు అంబటి రాంబాబు తదితరులతో కలిసి గురువారం మధ్యాహ్నం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు.
 
విమానాశ్రయంలో దిగగానే జగన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఎయిర్ పోర్టు లాబీల్లోకి చేరుకుంటుండగా పోలీసులు అడ్డంగా నిలబడి వారిని అడ్డుకున్నారు. డొమెస్టిక్ లాబీల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు వచ్చి చుట్టుముట్టి వారిని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఆకస్మిక పరిణామానికి విస్మయం చెందిన నాయకులు మీరెవరంటూ ప్రశ్నించినా వారి నుంచి సమాధానం రాలేదు. విమానం నుంచి దిగివస్తున్న తమను టెర్మినల్ లోకి వెళ్లేందుకు అనుమతించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినా వారినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఆగ్రహించిన నేతలు విమానాశ్రయం లాబీల్లోకి ఎందుకు అనుమతించడం లేదంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న వారికి తోడుగా మరికొందరు పోలీసులు వచ్చి ఆ నాయకులను వెనక్కి తోయడం ప్రారంభించారు.
 
కేంద్రప్రభుత్వ భద్రతా సిబ్బంది (సీఐఎస్ఎఫ్) సంరక్షణలో ఉండాల్సిన విమానాశ్రయంలో మీరంతా ఎవరు? ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించినా వారి నుంచి సమాధానం లేకపోగా నేతలను బయటకు వెళ్లనివ్వకుండా, విమానాశ్రయం లాబీల్లోకి కూడా అనుతించకుండా తోసేశారు. నాయకులపై చేతులు పెట్టి వెనక్కి నెట్టడం ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకుడు, ఎంపీలు అన్నది కూడా చూడకుండా వారిని తోయడం, వారి చుట్టూ ఒక చైనులా ఏర్పడి ముందుకు కదలకుండా అడ్డుకోవడం వంటి దుశ్చర్యలకు దిగారు. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను వారు వెనక్కి ఈడ్చుకెళ్లారు. 
 
సివిల్ డ్రెస్ లో ఉన్న మీరంతా ఎవరు? అని అడిగినా సమాధానం రాలేదు. ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్న కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన నేతల విషయంలో ఇలా సివిల్ డ్రెస్సులో ఉన్న వాళ్లు అడ్డుకోవడం మొత్తం యావత్ ప్రజలను విస్మయపరిచింది. ఎవరినైనా అడ్డుకోవాలన్నప్పుడు మరీ ముఖ్యంగా కేబినేట్ స్థాయి నేత, పార్లమెంట్ సభ్యుల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో రన్ వే వైపు పెద్ద సంఖ్యలో ముందుగానే పోలీసు బలగాలను మోహరించడం గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకూడదన్న ఎత్తుగడతోనే ఉన్నట్టు అక్కడున్న పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
 
విమానం నుంచి దిగీదిగగానే ఇదేంటి? మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ వారిపై జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని ముందస్తు సమాచారం ఉండగా, కొన్ని గంటల ముందే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ప్రజలను తరిమి తరిమి కొట్టారు. ఆ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను నియమించి ఎవరినీ అటువైపు రానీయకుండా అడ్డుకున్నారు. డీజీపీ స్వయంగా విమానాశ్రయం వద్దకొచ్చి పరిస్థితిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
 
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలన్న డిమాండ్‌పై విశాఖలోని ఆర్కే బీచ్ లో గురువారం సాయంత్రం భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టగా ఆ ర్యాలీలో పాల్గొంటానని జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నుంచి ఆర్కే బీచ్ కు ఎవరినీ రానీయకుండా పోలీసులు ప్రజలను.. మరీ ముఖ్యంగా యువతీ యువకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉదయం నుంచి విశాఖ తీరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా కనుచూపు మేరలో ఎవరు కనిపించినా తరిమికొట్టారు. 
 
ఒకవైపు విశాఖపట్నం మొత్తంలో పోలీసులను మోహరించి ఒక టెర్రర్ వాతావరణం సృష్టించిన అదికారులు తీరా జగన్ మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయం చేరుకున్న తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశారు. విమానాశ్రయం రన్ వే వైపు లోపలే అడ్డుకోవడం పట్ల జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రన్ వే పైనే మమ్మల్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఇలా అడ్డుకుంటున్న మీరంతా అసలు పోలీసులేనా (అంతా సివిల్ డ్రెస్సులో ఉన్నారు) అని, మీలో ఒక్కరు కూడా కనీసం ఐడీ కార్డులు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. రన్ వే పైన ప్రయాణికులను, అందులో ప్రతిపక్ష నాయకుడితో పాటు పార్లమెంట్ సభ్యులను అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పోలీసులు తమను రన్‌వే మీదనే అడ్డుకోవడం, అసలు లాంజ్ వైపు కూడా వెళ్లనివ్వకపోవడంతో.. 'మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇటువైపు వీఐపీ లాంజ్ ఉంది, అటువైపు అరైవల్ లాంజ్ ఉంది. అక్కడకు వెళ్లండి. అయినా అసలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారు? ఒక ప్రయాణికుడిగా కూడా నన్ను లోపలకు పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? లోపలకు అనుమతించండి, అక్కడ మాట్లాడదాం. ఎంతసేపు ఇక్కడ నిలబెడతారు? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే కూర్చుంటాం, తర్వాతి విమానం వచ్చిన తర్వాతైనా మీరు తలుపులు తీయాల్సిందే '' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా డిపార్టుమెంటులో ఎలా ఉన్నారని అడిగారు. డొమెస్టిక్ ఎరైవల్స్ అని బోర్డు కూడా కనిపించడంలేదా, ప్రయాణికులను అక్కడకు అనుమతించాలని మీకు తెలియదా అంటూ నిలదీశారు. తలుపు తీయాలని.. డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా రన్ వే మీద ఆపడం ఏంటని ప్రశ్నించారు.
 
ప్రతిపక్ష నేత ఎంతగా ప్రశ్నించినా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాగని ముందుకు అనుమతించలేదు. దాంతో తమను అనుమతించాల్సిందేనంటూ జగన్ మోహన్ రెడ్డితో సహా నేతలంతా రన్ వే నుంచి లాబీల్లోకి వెళ్లే దారిలో బైఠాయించి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. 
 
జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయం లాబీల్లోకి కూడా అనుమతించకుండా లోపలే నిర్భంధించారని తెలిసి విశాఖ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విమానం నుంచి జగన్ మోహన్ రెడ్డి దిగినా గంటల తరబడి ఆయన బయటకు రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక పరిసర ప్రాంతాల్లో దూరంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాపై నినాదాలు కొనసాగించారు. కొందరు యువకులు విమానాశ్రయం సమీపంలోకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డగించారు.
 
జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకోవడానికి ముందుగానే వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ తదితర నేతలందరినీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement