
సాక్షి, విశాఖపట్నం : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జనం గోడును వింటున్న జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోని కేఫెటేరియాలో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఈ దాడికి పాల్పడ్డాడు. సెల్ఫీ పేరుతో వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు హత్యాయత్నం చేశాడని ఘటనా ప్రాంతంలో విధుల నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దినేష్‌కుమార్ ఫిర్యాదుతో ఐపీసీ 307 (హత్యాయత్నం) సెక్షన్ కింద కేసు నమోదు చేశామనీ, ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ మల్లా శేషు తెలిపారు.