
చేసేది మీరు.. బలయ్యేది మేమా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధపై వేటు వేస్తారన్న కథనాలు సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఆమెను మార్చి కొత్త చీఫ్ నియామకం కోసం డీజీపీ రాముడు కూడా ఇప్పటికే రెండు పేర్లను సూచించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఏపీ పోలీసులలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అన్ని స్థాయులలోను తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకుని, వాటికి పోలీసులను బాధ్యులను చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం ఎన్కౌంటర్ తర్వాత జాతీయస్థాయిలో ఏపీ పోలీసుల ప్రతిష్ఠ మంటగలిసింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తాము చేశామని, దానికి తమను తప్పుబట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రాజధాని పంటభూముల్లో మంటలు వచ్చినప్పుడు పోలీసులను ఇరకాటంలో పెట్టారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల విషయంలో ఎంపీల మాట వినలేదని ఎస్పీని బదిలీ చేశారు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ఫోన్లు మాట్లాడినప్పుడు దీనికి, తమకు ఏంటి సంబంధమని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఏమైనా జరిగితే తాము బాధ్యులం అవుతాము గానీ, హైదరాబాద్ విషయంలో తమదెలా బాధ్యత ఉంటుందని మండిపడుతున్నారు. ఏదో చేస్తున్నట్లు చెప్పుకోడానికే తప్ప పోలీసులను బద్నాం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.