సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన నేతలు.. అధికారంలోకొచ్చాక ఆ మాటే మరిచారు. విభజన అనంతరం లోటు బడ్జెట్‌లో పడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో కొంత ఊరట దక్కుతుందని ఆశపడిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఏడాది గడిచినా దీని ఊసే పట్టించుకోకపోవడంపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. టీడీపీ మహానాడులో కనీసం ఆ అంశాన్నే ప్రస్తావించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అప్పుడలా.. ఇప్పుడిలా..
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఐదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. ఐదేళ్లు చాలదు.. పదేళ్లు కావాలంటూ అప్పుడు ప్రతిపక్షంలోనూ, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. తాను లోక్‌సభలో పట్టుబట్టడం వల్లనే మన్‌మోహన్ ప్రభుత్వం ఐదేళ్లయినా ప్రత్యేక హోదాను ఇచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పుకొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా అంశంపై చేతులెత్తేసింది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన టీడీపీ ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదు. కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా తన మంత్రులను కొనసాగిస్తోంది. దీంతో టీడీపీ తీరుపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
రోడ్డెక్కుతున్న జనం...
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ నాయకుడు, సినీనటుడు శివాజీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని విజయవాడ వద్ద కృష్ణానదిలో జలదీక్ష చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వామపక్ష పార్టీల నేతలు శనివారం ఏకంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్న హోటల్‌నే ముట్టడి చేశారు.
బాధ్యత గుర్తించాలి
రాష్ట్రాన్ని విభజించడంలో చూపించిన శ్రద్ధ నూతన రాష్ట్రానికి సహాయం చేయడంలో చూపడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన నేతలు, విభజన జరిగి ఏడాది పూర్తి కావస్తున్నా ఒక హామీ కూడా అమలు చేయలేదు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా అతి ముఖ్యమైనది. ఇప్పుడు ఆ హామీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడటం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పరిష్కరించి ఇవ్వవచ్చు.
- డాక్టర్ ఎం.సి.దాస్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, విశ్రాంత ఆచార్యులు
హామీ నిలుపుకొంటేనే విలువ
ప్రత్యేక హోదా రావడం వల్ల మన రాష్ట్రంలోకి వచ్చే పరిశ్రమలకు అనేక రాయితీలు వస్తాయి. దీనివల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదాకు సరిపడా సహాయం ఇతర విధాలుగా చేసేకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే విలువ ఉంటుంది. రాష్ట్ర విభజన వల్ల ఈ ప్రాంతం ఎంతో నష్టపోయింది. బడ్జెట్ లోటు ఏర్పడింది. ఎంతో ఆదాయం వచ్చే పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉండిపోయాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పించాలి. రాష్ట్ర విభజన జరిగి ఏడాది అయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు అసహనంతో ఉన్నారు.
- ముత్తవరపు మురళీకృష్ణ,
ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్
అవసరం తీరాక పక్కన పడేశారు
రాష్ట్ర విభజన సమయంలో నాటి పాలకులు, ప్రతిపక్ష నాయకులు పోటీలు పడి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అవసరం తీరాక పక్కన పడేశారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రజావసరాల కార్యక్రమాల నిర్వహణకు అవకాశం చిక్కుతుంది. గతంలో ప్రత్యేక హోదా ఇచ్నిన రాష్ట్రాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. నూతన రాష్ట్రంలో నిధుల కొరత కనిపిస్తోంది. ఆ లోటు తీర్చటానికి భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ ద్వారా అధిక పన్నుల భారం మోపటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీ ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలి.
- గోళ్ల నారాయణరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి
ప్రత్యేక దగా
Published Mon, Jun 1 2015 4:32 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement