నాటి స్వాతంత్రోద్యమం మొదలు.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం, నిన్నటి జై ఆంధ్ర.. ఆ తర్వాత సమైక్యాంధ్ర పోరు వరకు ఉద్యమ కెరటమై పోటెత్తిన విశాఖ తీరం ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటానికి కేంద్ర బిందువుగా మారింది.
‘సాక్షి’ ప్రతినిధి, విశాఖపట్నం/అమరావతి: నాటి స్వాతంత్రోద్యమం మొదలు.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం, నిన్నటి జై ఆంధ్ర.. ఆ తర్వాత సమైక్యాంధ్ర పోరు వరకు ఉద్యమ కెరటమై పోటెత్తిన విశాఖ తీరం ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటానికి కేంద్ర బిందువుగా మారింది. చెన్నై మెరీనా బీచ్‌ను ముంచెత్తిన జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 26న(నేడు) విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో హోదా పోరుకు యువజన, విద్యార్థి సంఘాలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు నడుం బిగించాయి. గణతంత్ర దినోత్సవం నాడు శాంతియుతంగా చేపట్టనున్న ఆందోళనపై పోలీసులు ముందుగానే ఉక్కుపాదం మోపడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను విశాఖ వెళ్తా.. అడ్డుకుంటారా.. దేనికైనా సిద్ధం’ అంటూ గర్జించారు. దీంతో ఉద్యమకారుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మరోవైపు హోదా పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.
ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు, సభలను అనుమతి ఇవ్వడం లేదని డీజీపీ నండూరి సాంబశివరావు పేర్కొన్నారు. రామకృష్ణ(ఆర్‌కే) బీచ్‌ను బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు ముట్టడించారు. బీచ్‌లో అడుగడుగునా ఖాకీలే కనిపిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి బీచ్‌లో ఎవరూ తిరగడానికి వీల్లేదని, మార్నింగ్ వాకర్స్ కూడా రావొద్దని హెచ్చరించారు. బీచ్‌రోడ్‌లో నివాసం ఉంటున్నవారు పోలీసు శాఖ జారీ చేసిన వాహన పాసులను లేదా తమ గుర్తింపు, నివాస ధ్రువపత్రాలను చూపిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు నగరాలు, పట్టణాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్రమంతటా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించకుండా సెక్షన్ 30ని కూడా అమల్లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. అటు కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. కాగా, అర్ధరాత్రి నుంచి పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు లక్ష్యంగా పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు.