ఈసారీ మొండిచెయ్యే! | AP vote-on-account budget outlay up 13.5% | Sakshi
Sakshi News home page

ఈసారీ మొండిచెయ్యే!

Published Tue, Feb 11 2014 2:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

AP vote-on-account budget outlay up 13.5%

వెరసి.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఈసారీ మొండిచెయ్యే చూపించింది. ఓటాన్ బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించింది. వెనుకబడిన జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులపై పూర్తిగా శీతకన్ను వేసి తన వైఖరేంటో స్పష్టం చేసింది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :రాష్ట్ర బడ్జెట్ జిల్లా వాసులకు ఈసారీ నిరాశే మిగిల్చింది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అరకొర నిధులే విదిల్చింది.  ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ జిల్లా ప్రయోజనాలను విస్మరించింది. వంశధార, మడ్డువలస, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తిచేయడంపై ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి చూపించ లేదు. అసలు ఆ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి ఏమిటి? పూర్తి చేయాలంటే ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలన్న విషయాన్నే పట్టించుకోలేదు. ప్రాజెక్టుల పూర్తి కోసం అధికారులు గత ఏడాది నవంబర్‌లో పంపిన ప్రతిపాదనలకు, బడ్జెట్‌లో కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. దిశానిర్దేశం లేని ప్రభుత్వ వైఖరి వల్ల జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సందిగ్ధంలో పడిన తీరు ఇలా ఉంది..
 
 వంశధారపై పూర్తి నిర్లక్ష్యం..
 జిల్లాను సస్యశ్యామలం చేసేం దుకు ఉద్దేశించిన వంశధార ప్రాజెక్టుపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపింది. లక్ష ఎకరాలకుపైగా సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు అరకొర నిధుల కేటాయింపు విస్మయపరుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.13 కోట్లు మాత్రమే కేటాయించడం జిల్లా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. 2004లో అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.933 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
 
 అంతటి భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈసారి కేవలం రూ.13 కోట్లు మాత్రమే విదల్చడం విడ్డూరం. ఇప్పటికే ఒడిశాతో ఉన్న వివాదాలతో ప్రాజెక్టు మూడేళ్లుగా పెండింగులో పడిపోయింది. ఆ వివాదం మన రాష్ట్రానికి అనుకూలంగా ఇటీవలే పరిష్కారం దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారీగా నిధులు ఇస్తే ప్రాజెక్టు పనులు చకచకా సాగుతాయని అంతా ఆశించారు. కానీ బడ్జెట్‌లో ప్రభుత్వ కేటాయింపు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 2013-14 వార్షిక బడ్జెట్‌లో వంశధార ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఈ ఏడాది కాలంలో కేవలం రూ.1.50 కోట్ల విలువైన పనులు మాత్రమే జరగటం విస్మయపరిచే వాస్తవం. ఈసారి బడ్జెట్‌లోనైనా పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ నిరాశే అయింది. 
 
 నీటిపారుదల శాఖ అధికారులు గత ఏడాది నవంబర్‌లో పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం అస్సలు పట్టించుకో లేదు. ప్రాజెక్టు పనుల కోసం రూ.120 కోట్లు, భూసేకరణకు రూ.10 కోట్లు, నష్టపరిహారం కోసం రూ.50 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. వీటితోపాటు ఓపెన్‌హెడ్ చానల్ పనుల కోసం రూ.50.66 కోట్లు కావాలని కోరారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.13 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఓపెన్ హెడ్ చానల్ పనుల కోసమే రూ.13 కోట్లు కేటాయించారని అధికారులు భావిస్తున్నారు. అంటే ఆ పనులు ఈ అరకొర నిధులతో పూర్తికావు. ఇక ప్రాజెక్టు పనులు, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు అనేవి పూర్తిగా అటకెక్కినట్లేనని అధికారులు నిసృ్పహ వ్యక్తం చేస్తున్నారు.
 
 తోటపల్లి’కి తోడ్పాటేదీ!
 శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వరప్రదాయినిగా గుర్తింపు పొందిన తోటపల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. మసి పూసి మారేడు కాయ చేసిన తీరులో గణాంకాలతో కనికట్టు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో తోటపల్లి ప్రాజెక్టుకు రూ.120 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిధులు భారీగా కేటాయించినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు కనికట్టు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. అందులో ఈ జిల్లాలోని 80 వేల ఎకరాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు సక్రమంగా కేటాయించడం లేదు. ఫలితంగా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికాకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. తొలుత రూ.540 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తాజా అంచనా ఇప్పటికే రూ.800 కోట్లకు చేరింది. గత ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. కానీ వాస్తవానికి రూ.60 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 
 
 దాంతో నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తికాలేదు. ఈ ఏడాది అనుకున్న విధంగా పనులు పూర్తికావాలంటే కనీసం రూ.106 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాది పెండింగులో ఉన్న రూ.60 కోట్లకు అదనంగా ఈ రూ.106 కోట్లు కేటాయించాలని కోరారు. అంటే మొత్తం రూ.166 కోట్లు అవసరమని నివేదించారు. కానీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో కేవలం రూ.120 కోట్లు మాత్రమే కేటాయిస్తునట్లు ప్రకటించింది. ఈ నిధులు దేనిదేనికి ఖర్చుచేయాలో కూడా స్పష్టం చేయలేదు. వాస్తవానికి అందులో ఎంత విడుదల చేస్తుందో కూడా సందేహమే. ప్రభుత్వం ఈ రీతిలో అంకెల గారడీ చేసి రైతాంగాన్ని మోసం చేసిందనే చెప్పాలి. దాంతో కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది కూడా పనులు అనుకున్న విధంగా పూర్తికావడం దాదాపు అసాధ్యమేనని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
 
 ఆఫషోర్ రిజర్వాయర్‌కు మోక్షమెప్పుడో!
 మహేంద్రతనయ నదిపై చేపట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు కూడా ప్రభుత్వం మొండిచెయ్యే చూపించింది. ఈ ఏడాది ప్రతిపాదిత పనుల కోసం కనీసం రూ.46 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.15కోట్లతో  సరిపెట్టింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.127 కోట్ల అంచనాతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తద్వారా టెక్కలి, నందిగాం, పలాస, మెళియాపుట్టి మండలాల్లోని 24,600 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఆ మహానేత లక్ష్యం. 
 
 అంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు రూ.36.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో 12 శాతం పనులే పూర్తయ్యాయి. మరో 600 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. చాపర నుంచి రిజర్వాయర్ వరకు 13.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన వరద కాలువ పనుల్లో ఇప్పటికి 5.9 కిలోమీటర్ల వరకే పూర్తయ్యాయి. పూలసారి వద్ద 5.9 కిలోమీటర్ల నుంచి 6.5 కిలోమీటర్ల వరకు 600 మీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. అక్కడనుంచి రిజర్వాయర్ వరకు వరద కాలువ నిర్మించాల్సి ఉంది. హీరాపురం నుంచి రేగులపాడు వరకు గల 2.28 కిలోమీటర్లు రోడ్డు రిజర్వాయర్‌లో కలుస్తుంది. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ రోడ్డును కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ ఎర్త్‌బండ్ వద్ద కటాఫ్ ట్రెంచ్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కూడా నిధులు సరిగా కేటాయించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం సందిగ్ధంలో పడింది.
 
 మడ్డువలస’కూ అరకొరే!
 భారీ నిధులు అవసరమైన ప్రాజెక్టులకు మొండిచెయ్యి చూపిన ప్రభుత్వం కనీసం మడ్డువలస ప్రాజెక్టును కూడా కనికరించలేదు. కొంచెం చిత్తశుద్ధి చూపితే పూర్తయిపోయే ఈ ప్రాజెక్ట్‌కు కూడా తగినన్ని నిధులు కేటాయించ లేదు. ప్రాథమికంగా 24,700 ఎకరాలకు, తదనంతరం మరో 12,500 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు నిధుల  కేటాయింపులో న్యాయం చేయలేదు. జి.సిగడాం, పొందూరు, లావేరు మండలాల్లో 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు అందించేందుకు రూ.39 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement