ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
కళ్యాణదుర్గం రూరల్ : ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు పలికారు. హిందూపురం రోడ్డు నుంచి డిపో వరకు బుధవారం కార్మికులు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రైవేటు బస్సుల ఆపరేటర్లుగా చలామణి అవుతున్నారని విమర్శించారు. ఆ నేతల కనుసన్నుల్లో ఆర్టీసీ సంస్థనడుస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో సంస్థ అభివృద్ది కోసం రూ.1700 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నష్టాలపేరుతో అధికార పార్టీ బడా నేతలకు సంస్థను అప్పజెప్పేందుకు లోగుట్టుగా యత్నిస్తోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదడు మోకాల్లో ఉందని విమర్శించారు. కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలని సీఎంకు సూచించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నాగ న్న, ముత్యాలప్ప, కే.కే మూర్తి, గణపతి, వేణు,కాంగ్రెస్ నాయకులు అనీల్ చౌదరి, బాలబాబు, తదితరులు పాల్గొన్నారు.