
మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో లక్కీ వైన్స్‌కు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.
ఒక్క దరఖాస్తూ రానివి 354 షాపులు
దరఖాస్తుల రూపంలో రూ.224 కోట్లు ఆదాయం
రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యధికంగా దరఖాస్తులు
లక్కీ వైన్స్‌కు నేడే కలెక్టర్ల సమక్షంలో లాటరీ
ఒక్క దరఖాస్తూ రాని షాపులకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో లక్కీ వైన్స్‌కు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,478 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 3,124 మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు అందాయి. ఒక్క దరఖాస్తు కూడా రాని దుకాణాలు 354 ఉన్నాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల ఫీజు కింద రూ.224 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఉన్న 515 దుకాణాల్లో 49 దుకాణాల్ని ప్రభుత్వం నిర్వహించనుంది.
ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. ఎక్సైజ్ కమిషనర్ రాసిన లేఖపై సోమవారం ఎన్నికల సంఘం నుంచి వివరణ రానుంది. ఈ రెండు జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ జారీ చేస్తే దరఖాస్తుల రూపంలో ఆదాయం రూ.250 కోట్లు దాటుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదట ముగిసిన తర్వాత 743 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. ఈ దఫా లెసైన్సు కాలపరిమితి రెండేళ్లు కావడంతో పోటీ ఎక్కువగానే ఉంది.
నడికుడి దుకాణానికి అత్యధికంగా 354 దరఖాస్తులు
రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 11,548 దరఖాస్తులు అధికారికంగా ప్రకటిస్తున్నా.. పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఇంకా దరఖాస్తుల క్రోడీకరణ ప్రక్రియ పూర్తి కానట్లు సమాచారం. దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కేవలం నాలుగు షాపులకు మాత్రమే దరఖాస్తులు రాలేదు. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.35 కోట్ల దరఖాస్తు ఫీజు వచ్చింది. నడికుడి దుకాణానికి గతంలో 223 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 354 దరఖాస్తులు అందాయి. అడిగొప్పులకు 248 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాల్లో 11,162 దరఖాస్తులు అందాయి. కడప జిల్లాలో అత్యల్పంగా 190 దుకాణాలకు 2,161 దరఖాస్తులు అందాయి.
చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క దరఖాస్తూ రాని షాపులు అధికం
ఒక్క దరఖాస్తు రాని షాపులు రాష్ట్రం మొత్తం 354 ఉంటే, అధికంగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్నాయి. చిత్తూరులో 90 షాపులకు, పశ్చిమగోదావరిలో 32 షాపులకు ఒక్క దరఖాస్తు రాలేదు. ఈ రెండు జిల్లాల్లో జనాభా కంటే తక్కువగా గతం నుంచి షాపులను నోటిఫై చేస్తున్నారు. ప్రతి 12 వేల జనాభాకు ఒక మద్యం షాపు నోటిఫై చేయాల్సి ఉండగా, చిత్తూరు జిల్లాలో ప్రతి ఏడు వేల మంది జనాభాకు ఓ షాపు, పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి 9 వేల మంది జనాభాకు ఓ షాపు కేటాయించడం వల్ల ఇక్కడ ఎక్కువగా షాపులకు అసలు దరఖాస్తులు అందలేని అబ్కారీ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులు కృష్ణా జిల్లాలో 29 వరకు ఉన్నాయి.
ఒక్క దరఖాస్తు రాని దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్: కమిషనర్ శ్రీనివాస శ్రీ నరేష్
రాష్ట్రంలో ఒక్క దరఖాస్తు రాని దుకాణాలకు సోమవారం మరో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీ నరేష్ తెలిపారు. సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులను దరఖాస్తు చేసిన వారికే కేటాయిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆయా జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో లాట్ల విధానంలో లాటరీ తీసి షాపులకు ప్రొవిజనల్ లెసైన్సు కేటాయించనున్నట్లు వివరించారు.
జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు
శ్రీకాకుళం 202 4,516
విజయనగరం 179 3,512
విశాఖపట్టణం 329 5,846
తూర్పుగోదావరి 410 6,800
పశ్చిమగోదావరి 400 11,162
కృష్ణా 294 6,995
గుంటూరు 303 11,548
నెల్లూరు 291 5,800
చిత్తూరు 320 3,048
అనంతపురం 206 3,786
వైఎస్సార్ జిల్లా 190 2,161
మొత్తం 3,124 65,174
నోటిఫై చేసిన మద్యం షాపులు - 3,478
ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలు - 387
ఒక్క దరఖాస్తు రాని దుకాణాల సంఖ్య - 354
(కర్నూలు, ప్రకాశం జిల్లాలను మినహాయించి).