విజయనగరం కంటోన్మెంట్: మొదటి దానికి మొగుడు లేడు..కడదానికి కల్యాణం అన్నట్లు ఉంది ప్రభుత్వం తీరు. వారానికి ఒకసారి నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే అర్జీలే పరిష్కారం కాని పరిస్థితి ఉండగా..ఇకనుంచి ప్రతిరోజూ గ్రీవెన్స్ సెల్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. వారానికి ఒక్క రోజు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా నిత్యం తీసుకుంటున్న అర్జీలను కూడా మీకోసం సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తుంటారు. వారానికి ఒకసారి తీసుకున్న అర్జీలన్నీ ఇప్పటికే చాంతాడంత జాబితాతో పెండింగ్ ఉండిపోగా ఇక రోజూ నిర్వహిస్తే మరింత పెండింగ్ తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో రెండు నెలల క్రితం మీ కోసం సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. గ్రీవెన్స్ విధానం పాతదయినా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియకు మాత్రం హంగులద్దారు.
ఇందులో చంద్రబాబు ఫొటోతో ఉన్నట్టు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే ఇప్పటికీ ఆ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తున్న సమస్యలు, వినతులు అలానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,68,082 అర్జీలు మీకోసం సాఫ్ట్‌వేర్‌లో నమోదయ్యాయి. ఈ అర్జీల్లో పరిష్కారమయినవి 5,446 మాత్రమే! అంటే గ్రీవెన్స్ ద్వారా వచ్చే సమస్యలకు ఎంతటి పరిష్కారం లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో పరిష్కారానికి గడువున్న అర్జీలు 4938 ఉండగా గడువు దాటిపోయినవే ఎక్కువ! జిల్లా వ్యాప్తంగా సోమవారం, ఇతర దినాల్లోనూ కలెక్టర్‌కు వచ్చిన అర్జీలన్నీ ఇందులో పొందుపరుస్తారు. వీటన్నిటికీ ఓ గడువు ఇచ్చి సరిచూసుకోమని అధికారులు సూచిస్తారు. అయితే మీకోసం సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసినప్పటినుంచి ఇప్పటివరకూ వచ్చిన 1.68 లక్షల అర్జీల్లో 1,57,698 అర్జీలకు అధికారులు పరిష్కారానికి ఇచ్చిన గడువు ఏనాడో దాటిపోయింది. అంటే పరిష్కారానికి నోచుకున్నది కేవలం 3.24 శాతమే!
రెవెన్యూ సమస్యలే అధికం !
జిల్లా వ్యాప్తంగా వస్తున్న అర్జీల్లో ఇతర శాఖల కన్నా రెవెన్యూ సమస్యలపైనే అధికంగా వస్తున్నాయి. భూ సమస్యలు, చెల్లింపులు, పరిహారాలు, వన్‌బిలు, సర్వే నంబర్ల తప్పులు, ఆక్రమణల వంటి రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకోని అర్జీలు కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నాయి. ఈ సమస్యలు ఇక్కడ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మీకోసం వెబ్‌సైట్‌లో నమోదైన అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 1,33,265 వచ్చాయి. వీటిని సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసిన అధికారులు వాటికి పరిష్కారాలు చూపలేకపోయారు. 1.33 లక్షల అర్జీల్లో కేవలం 4,808 అర్జీలు మాత్రమే పరిష్కరించారు. గడువులోపల ఉన్నవి 932 అర్జీలు. గడువు దాటిపోయిన అర్జీలు ఏకంగా 1,27,525 ఉన్నాయి.
సమస్య పరిష్కారమంటే...తీరిపోయినట్లా?
మీకోసం వెబ్‌సైట్‌లో ఉన్న ఫిర్యాదులను ఏదో ఒక విధంగా పరిష్కరించేటట్టు కనిపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరిష్కరింపబడిందంటే మీ అర్జీకి విలువలేనిదనీ, అర్థం లేనిదని, వీలు కాదని, నిబంధనలకు విరుద్ధమని ఇలా ఏదో ఒక కారణంతో క్లోజ్ చేస్తే అవి పరిష్కారం జాబితాలో చేరిపోతాయి. అదేవిధంగా సమస్య తీర్చినవీ ఉంటాయి. కానీ అది చాలా చిన్న సంఖ్య మాత్రమే! ఇవన్నీ కూడా సీఎం డాష్‌బోర్డులో దర్శనమివ్వడం కొసమెరుపు!
‘మీకోసం’ ఏం చేశారు..!
Published Mon, Aug 10 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement