వలసకు వెళితే..భూమి కబ్జా చేశారు..
విజయనగరం కంటోన్మెంట్ :కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతే తన భూమిని కబ్జా చేశారని ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన ఎద్దు కృష్ణమ్మ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన కొట్యాడ అప్పలనరసయ్య తన భూమిని ఆక్రమించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కలెక్టర్ ముదావత్ ఎం. నాయక్ సెలవులో ఉండడంతో గ్రీవెన్స్‌సెల్‌ను జేసీ రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా 250 వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వచ్చిన వాటిలో కొన్ని ఫిర్యాదులు మున్సిపల్ స్థలాలు ఆక్రమించుకున్నారు
బూర్లిపేటలోని మున్సిపల్ స్థలాలను కొంతమంది ఆక్రమించుకుని షాపులు నిర్మించుకున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ బలరాంసింగ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 38వ వార్డులోని ప్రభుత్వ స్థలంలో కొంతమంది ఐదు షాపులు నిర్మించారని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులను శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
పాఠశాల స్థలం కబ్జా
భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ రెల్లిపేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సకల రాజారావు కబ్జా చేశారని గ్రామానికి చెందిన డి శ్రీను, ధనాల సోమయ్య, రమణ, అప్పారావు, సన్యాసి, నర్సింగరావు, రాము, తదితరులు ఫిర్యాదు చేశారు.
రెగ్యులర్ చేయాలి
ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లోని సోషల్, పీఈటీ, ఎస్‌జీటీ, తదితర పోస్టులను వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు జి అప్పలసూరి డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.
ూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు
భూమిని ఆక్రమించుకున్నాడు
గరివిడి మండలం మందిరివలసలో పోరంబోకు భూమిలో జీడి తోటలు వేసుకుంటే పక్క గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు తాళ్లవలస ఆదినారాయణ భూమిని ఆక్రమించుకున్నాడని గ్రామానికి చెందిన రేజేటి లక్ష్మి, టెక్కలి లక్ష్మి, సుక్క లక్ష్మి, తదితర మహిళలు ఫిర్యాదు చేశారు. దీనికి జేసీ రామారావు స్పందిస్తూ సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ జెక వెంకటరావుకు ఫోన్ చేసి ఆదేశించారు.
వినతుల వెల్లువ
పార్వతీపురం : సబ్ కలెక్టర్, ఐటీడీఏ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎల్విన్‌పేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.సీతారామ్మూర్తి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాపురానికి చెందిన తిరుపతిరావు అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ముందు అందరికీ ఆధార్ కార్డులందేలా చూడాలని కోరారు. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలంలో పనిచేస్తున్న జీసీసీ నిర్వాహకుడు మిన్నారావును తొలగించాలని మండల కేంద్రానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా సాగు చేస్తున్న బంజరుభూమికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మంజూరు చేయాలని కురుపాం మండలం జి.శివడకు చెందిన ఆరిక జగ్గన్న వినతిపత్రం సమర్పించారు. అలాగే ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ వసంతరావు నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జియ్యమ్మవలస మండలం చాపరాయగూడకు చెందిన గ్రామస్తులు మంచినీటి ట్యాంకు నిర్మించాలని కోరారు. కురుపాం మం డలం పి.లేవిడికి చెందిన బి. చిన్నమ్మలు, తదితర 22 మంది తమకుసాగు చేసుకునేందుకు భూ మి మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలంలోని బం టుమక్కువకు చెందిన డి. గురవందొర, గుమ్మలక్ష్మీపురం మండలం మిరయగూడకు చెందిన బిడ్డిక లక్కోజులు తమ భూములను గిరజనేతరులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. సమస్యలన్నీ విన్న అధికారులు పరి ష్కరించడానికిచర్యలు తీసుకుంటామన్నారు.