పాస్‌పుస్తకాలకు లంచం డిమాండ్ | Pass book demanding bribe in Vizianagaram | Sakshi
Sakshi News home page

పాస్‌పుస్తకాలకు లంచం డిమాండ్

Published Tue, Sep 16 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

Pass book demanding bribe in Vizianagaram

 విజయనగరం కంటోన్మెంట్ :పట్టాదారు పాస్‌పుస్తకాల మంజూరుకు వేపాడ మండల డిప్యూటీ తహశీల్దార్ బెంజుమన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మండలంలోని సింగరాయ గ్రామానికి చెందిన ఆర్. అప్పారావు, తదితరులు జేసీ బి. రామారావుకు ఫిర్యాదు చేశారు. ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్ చేసి డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ ఎం. ఎం నాయక్ సెలవులో ఉండడంతో జేసీ రామారావు సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. 202 వినతులు స్వీకరించి వాటి పరిష్కారినికి చర్యలు తీసకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
 
 వచ్చిన వాటిలో కొన్ని ఫిర్యాదులు మీ సేవలో డబ్బులు అడుగుతున్నారు
 నెల్లిమర్ల మండల కేంద్రానికి మంజూరైన మీ సేవా కేంద్రాన్ని గుర్లలో నిర్వహించడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకుడు చింతాడ రాజుపై  గుర్ల గ్రామానికి చెందిన మొదిలి వెంకటనాయుడు ఫిర్యాదు చేశారు. ఆధార్, అడంగల్, కుల, ఆదాయ, తదితర ధ్రువపత్రాల కోసం వెళ్లిన వారి నుంచి సాధారణ రుసుముతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని జేసీ దృష్టికి తీసుకువచ్చారు.
 
 డబ్బును రికవరీ చేయాలి
 మక్కువ మండలం ఎం వెంకంపేటలో క్వారీ నిర్వహిస్తున్న మావుడి రంగునాయుడు అనే వ్యక్తికి నాలుగు ఎకరాలకు మాత్రమే అనుమతి ఉండగా 53 ఎకరాల్లో తవ్వకాలు జరిపి విలువైన రాయిని తరలించుకుపోతున్నాడని ఎంపీపీ పి. ఉమ ఫిర్యాదు చేశారు. ఆర్ ఆర్ యాక్టు ప్రకారం రాయితో పాటు డబ్బును రికవరీ చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఉమ, తిరుపతి, తదితరులు కోరారు.  
 
  అమ్మకాలు నిలిపివేయాలి
 జిల్లా కేంద్రంలోని రింగురోడ్డు రైతుబజార్ పక్కనే ఉన్న రహదారిపై కూడా కూరగాయలు అమ్మడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతోందని పట్టణానికి చెందిన ఎంఎల్ నారాయణ, తదితరులు వినతి అందించారు. అమ్మకాలను నిలిపివేయాలని కోరారు.  
 
  పంటలు  కలుషితం
 పూసపాటి రేగ మండలం  కందివలస వద్ద ఉన్న మైలాన్ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల సమీపంలోని చెరువులు, ఆ నీటితో సాగయే పంట భూములు కలుషితమవుతున్నాయనీ కందివలస గ్రామస్థులు అప్పారావు తదితరులు ఫిర్యాదు చేశారు. ప్రజలు కూడా చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు జేఈ దృష్టికి తీసుకువచ్చారు.  
 
 పార్వతీపురం : గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏపీఓ జె వసంతరావు సిబ్బందిని ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని పీఓ చాంబరులో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. బాడంగి మండలం పిండ్రంగివలస గ్రామస్తుడు అప్పన్నదొర వ్యవసాయానికి  ఆయిల్ ఇంజన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం బక్కుపేట గ్రామానికి చెందిన జి.అప్పారావు గ్రామంలో బోరుబావి ఏర్పాటు చేయాలని, మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన సిర్లాపు రామకృష్ణ జిరాక్స్ మిషన్ మంజూరు చేయాలని వినతులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం బల్లేరు గూడ గ్రామానికి చెందిన టి.భాస్కరరావు గ్రామానికి రహదారి ఏర్పాటు చేయాలని, కురుపాం మండలం పి.లేవిడి గ్రామస్తుడు ఎ.శాంతికుమారి స్మార్ట్‌కార్డు కావాలని కోరుతూ దరఖాస్తులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోడుకు చెందిన పి. అలాజీ గ్రామానికి రహదారి వేయాలని, పార్వతీపురం మండలం తేలునాయుడువలస గ్రామానికి చెందిన దండాసి సన్యాసిరావు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు.  అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ టి.రామకృష్ణ నిర్వహించిన గ్రీవెన్స్‌లో పలువురు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు కావాలని వినతులు సమర్పించారు.
 
 ఐదు ఫిర్యాదుల స్వీకరణ
 విజయనగరం క్రైం : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ గ్రీవెన్స్‌సెల్  నిర్వహించి ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచి సీఐలు  వి.లీలారావు, కృష్ణారావు, ఎస్సై కె. రామారావు, తదితరులు పాల్గొన్నారు.  కొన్ని ఫిర్యాదులు  విజయనగరం పట్టణంలోని ఎస్‌వీఎన్ నగర్‌కు చెందిన ఎం.గీత ఎస్పీతో మాట్లాడుతూ, తన కుమారుడు సందీప్  మెరైన్  ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసంప్రయత్నం చేస్తుండగా, మీరట్‌కు చెందిన కులదీప్‌కుమార్ సింగపూర్‌లో మెరైన్‌షిప్పింగ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,11,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది.   మూడు సంవత్సరాలుగా తన భర్త కానిస్టేబుల్ ఎం. ప్రసాద్ తనను వేధిస్తున్నట్లు మెంటాడ మండలం తమ్మిరాజుపేట గ్రామానికి చెందిన ఎం.సరోజిని ఫిర్యాదు చేసింది.    తన భార్య ఎల్లమ్మ ప్రతినెలా రూ.50 చొప్పున డ్వాక్రా సంఘానికి చెల్లించినప్పటికీ ఆర్. సన్యాసిరావు అనే వ్యక్తి ఆ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు  నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ఆర్.సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement