ఇంతేనా..!
► క్వింటా ధాన్యానికి ప్రభుత్వం పెంచిన మద్దతుధర రూ.80 మాత్రమే..
► పెరిగిన పెట్టుబడికి ధర సరిపోదంటున్న రైతులు
► కష్టం గుర్తించడంలేదంటూ ఆవేదన
విజయనగరం గంటస్తంభం: రోజురోజుకూ సాగు ఖర్చులు పెరుగుతున్నాయి.. ఎరువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి.. దుక్కిరేట్లు రెట్టింపయ్యాయి.. వెబ్‌ల్యాండ్ విధానం భయపెడుతోంది.. మరోవైపు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం పంటకు గిట్టుబాటు ధర లేకపోతోంది... కష్టాన్ని గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటాకు కేవలం రూ.80 పెంచడంపై మండిపడుతున్నారు. పంటపై వచ్చిన రాబడి పెట్టుబడులకే సరిపోతోందని, శ్రమకు విలువ లేకుండా పోతోందని వాపోతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు అప్పులే మిగులుతున్నాయంటున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం మద్దతు ధర పెంచుతుందని ఆశించామని, తీరా రూ.80 పెంచి చేతులు దులుపుకుందని దిగులు పడుతున్నారు.
క్వింటా ధాన్యం రూ.1550
దేశవ్యాప్తంగా పలు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రధానంగా పండే వరి పంటకు కూడా మద్దతు నిర్ణయించారు. దీనిప్రకారం క్వింటా ధాన్యానికి రూ.80 మాత్రమే పెంచారు. గతేడాది సాధారణ రకానికి మద్దతు ధర క్వింటాకు రూ.1470 ఉండగా గ్రేడ్–ఏ రకానికి రూ.1510 ఉండేది. తాజాగా ఈ ఏడాది రెండు రకాలపై క్వింటాకు రూ.80 పెంచడంతో సాధారణ రకం రూ.1550, గ్రేడ్ ఏ రకం రూ.1590 అవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో పండించిన ధాన్యానికి రైతులకు ఇదే మద్దతు ధర లభిస్తోంది. ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంతో ఇంతకంటే రైతులకు ధర పెరిగే అవకాశం లేదు.
నిరాశజనకమే..
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మద్దతు ధర రైతులకు నిరాశజనకంగా ఉంది. పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో ఈధర పెద్దగా ప్రయోజనం ఉండదు. జిల్లాలో 4.64 లక్షల మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది సన్నచిన్నకారు రైతులే. 1.20 లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేస్తున్నారు. పంట సక్రమంగా పండితే ఏడాదికి సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికందుతాయి. అయితే, భూకమతాలు చాలా చిన్నకావడంతో రైతులకు పెట్టుబడి పెరుగుతోంది. దుక్కి, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు తలకుమించిన భారమవుతున్నాయి. ఏడాదికి క్వింటా ధాన్యంపై సాగు ఖర్చులు రూ.50 నుంచి రూ.80వరకు పెరుగుతోంది. ప్రభుత్వం మద్దతు ధర కూడా అదే స్థాయిలో ఉండడంతో శ్రమకు ఫలితం దక్కదని, కౌలురైతులకు కష్టాలు తప్పవంటూ ఆవేదన చెందుతున్నారు. ధర పెంచాలని కోరుతున్నారు.