ఓ ఇంటివారు ఎప్పుడవుతారో? | Own house Sanctioned within week of Bill | Sakshi
Sakshi News home page

ఓ ఇంటివారు ఎప్పుడవుతారో?

Published Wed, May 21 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

ఓ ఇంటివారు ఎప్పుడవుతారో?

ఓ ఇంటివారు ఎప్పుడవుతారో?

 విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన తయారైంది ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి. కొత్త  ఇల్లు నిర్మించుకోవచ్చునని ఉన్న ఇంటిని ఊడదీయడంతో ఇప్పుడు నిలువనీడలేక అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. సొంత ఇల్లును  తొందరగా నిర్మిం చుకోవాలన్న వారి ఆశ.. బిల్లులు మంజూరు కాని కారణంగా ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపిం చడం లేదు. ఈ క్రమంలో కొంత మంది అద్దె ఇళ్లలో తలదాచుకోగా, మరి కొంతమంది నిర్మా ణం చేపట్టిన ఇంటి వద్ద చిన్న సైజు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు.  
 
 రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇల్లు మంజూరు చేయడానికి సంవత్సరాల తరబడి తిప్పించిన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడానికి కూడా అదే పరిస్థితిని కల్పిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలంటూ గృహనిర్మాణశాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇల్లు నిర్మించిన వారం రోజుల్లో బిల్లు మంజూరయ్యేది. ఇప్పుడు నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరుకాని దుస్థితి నెలకొంది. బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారుల్లో కొంతమంది లింటల్ లెవెల్లో నిర్మాణం నిలిపివేయగా, మరికొంతమంది శ్లాబు స్థాయి వరకు నిర్మించి  ఆపివేశారు.
 
 బిల్లు అందిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తామని  వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చిన లబ్ధిదారులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పు తీర్చాలని వ్యాపారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లుల మీద ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు. మొదటి విడత రచ్చబండ కింద జిల్లాకు 18 వేల  ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 7వేల వరకు నిర్మాణం  పూర్తయ్యాయి. రెండోవిడత రచ్చబండ కింద 25వేల ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 5వేల వరకు ఇళ్లు పూర్తయ్యాయి. జీఓ నంబరు 44కింద 52 వేల ఇళ్లు 2013 అక్టోబర్‌లో మంజూరయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో 3వేల మంది నిర్మాణం చేపట్టారు. వారిలో కొంతమంది లింటల్ లెవల్ వరకు ఇళ్ల నిర్మాణం చేయగా, మరి కొంతమంది శ్లాబు లెవెల్ వరకు అప్పులు చేసి నిర్మాణం పూర్తిచేశారు. జిల్లాలో  ఈ ఏడాది మార్చి నెల నుంచి  ఇళ్ల బిల్లుల మంజూరు నిలిచిపోయింది.  దీంతో నిరుపేద  లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  
 
 బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం
 గతంలో ఇల్లు నిర్మించిన వారం రోజుల్లో లబ్ధిదారుడి ఖాతాలో బిల్లు జమ అయింది. గత  ఏడాది కాలంగా బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణం చేపట్టిన  నెల నుంచి రెండు నెలల వరకు బిల్లు మంజూరు కావడం లేదు. దీంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. బిల్లు మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణం చేపట్టడానికి డబ్బులు లేక లబ్ధిదారులు  బిల్లులు వచ్చే వరకు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. బిల్లు వచ్చిన తర్వాత నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టే పరిస్థితి జిల్లాలోని లబ్ధిదారులది. ప్రభుత్వ అలసత్వం కారణంగా నిరుపేద లబ్ధిదారుల సొంతింటి కల ఎప్పటికి నెరవేరుతుందో వేచి చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement