భయో మెట్రిక్!
Published Mon, Dec 23 2013 2:38 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్న బయోమెట్రిక్ విధానం అధికారులు, కళాశాలల యజమానుల్లో పలు అనుమానాలు, విద్యార్థుల్లో భయాందోళన రేపుతోంది. ఉపకార వేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులైన విద్యార్థులను గుర్తించడానికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టనున్న బయోమెట్రిక్ విధానం వల్ల ఎవరికి ఉపయోగమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటికేడా ది నిబంధనలను మార్చేసి విద్యార్థులను, అధికారుల ను గందరగోళంలోకి నెడుతున్న ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఈ విధానంతో అందరికీ తలనొప్పులు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది వరకు ఎఫ్‌ఎల్‌ఓలు నేరుగా కళాశాలలకు వెళ్లి విద్యార్థులను పరిశీలించి ఉపకార వేతనాలు పొందడానికి అర్హులను గుర్తించేవారు.
అయితే ఈ విధానం వల్ల జాప్యం జరుగుతోందన్న భావనతో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో స్పష్టత లేకపోవడంతో అధికారులతో పాటు కళాశాలల యాజమాన్యాల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఉపకార వేతనాలు అందుతాయో లేదోనన్న భయాందోళనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు నంబరును ఆధారంగా చేసుకుని ఆన్‌లైన్‌లో ఉపకార వేతనాలు చెల్లించేలా ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. దీనిద్వారా లబ్ధిపొందాలంటే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ పొం ది ఉండాలి. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన తరువాతే ఉపకార వేతనం మంజూరు చేస్తారు.
పాఠశాలలో బయోమెట్రిక్ విధానం ద్వారా విద్యార్థుల వేలి ముద్రలను పరిశీలించి, ఆ వివరాలను సంక్షేమ శాఖల అధికారులకు అందజేస్తారు. అధికారులు కూడా ఆ వివరాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కళాశాలల ప్రిన్సిపాళ్లు బాధ్యత వహించాలని, అలాగే ఆధార్ లేని విద్యార్థులను గుర్తించే బాధ్యత కూడా ప్రిన్సిపాళ్లదేనని స్పష్టం చేశారు. దీంతో పాటు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు పుట్టిన తేదీ, ఎస్‌ఎస్‌సీ ఐడీ నంబరు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నంబర్‌ను ‘ఈ పాస్’ వెబ్‌ైసైట్‌లో పొందుపరచాలి. ఈ ప్రక్రియలో కచ్చితమైన సమాచారం పొందుపరిచే విధంగా ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ విద్యార్థికి ఉపకార వేతనం నిలిచిపోతుంది. దీనికి తోడు చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదు.
మిషన్లు ఎలా కొనాలి...?
బయోమెట్రిక్ విధానంతో తమ జేబుకు చిల్లు పడుతుందని కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బయోమెట్రిక్ మిషన్ ఒకటి రూ.28 వేలని, అంత మొత్తాన్ని వెచ్చించి మిషన్లను ఎలా కొనుగోలు చేయగలమని చిన్న కళాశాలల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఉన్న విద్యార్థుల ఆధారంగా ఈ మిషన్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 296 కళాశాలలున్నాయి. ఈ విధానం వల్ల విద్యార్థుల కంటే బయోమెట్రిక్ కంపెనీలకే లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Advertisement
Advertisement