
అక్కరకురాడు
=హాస్టళ్లలో ఐదేళ్లుగా అమలుకాని పథకం
=అవస్థలు పడుతున్న విద్యార్థులు
=సమరసాక్షితో కదిలిన అధికార యంత్రాంగం
ఉన్నఊరిని.. కన్నవారిని వదిలి పగలంతా చదువులమ్మ ఒడిలో.. రాత్రివేళ సమస్యల లోగిళ్లలో.. నిరంతరం చదువుల పోరాటం సాగిస్తున్న పేద బిడ్డలకు ‘ఆత్మీయుడు’ అక్కరకు రావడంలేదు. ఐదేళ్ల కిందట వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మీయుడు’ కార్యక్రమం ఏడాదిపాటు సజావుగా సాగినా ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఫలితంగా చాలా వసతిగృహాల్లో వార్డెన్లు పెట్టిందే తినాలి.. చెప్పిందే వినాలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వసతి గృహాల్లో ఇబ్బందులపై మూడు రోజులుగా ‘సమరసాక్షి’ కలమెత్తడంతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్పందించడాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షిస్తున్నారు.
సాక్షి, మచిలీపట్నం : హాస్టళ్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలివ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘ఆత్మీయుడు’ కార్యక్రమానికి నిర్లక్ష్యపు బద్దకాన్ని వదిలిస్తే వసతిగృహాల పనితీరు మరింత మెరుగుపడుతుంది. ప్రతి వసతిగృహంలో ఉన్న మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి, ఇంకా ఏం కావాలి.. లోపాలుంటే చక్కదిద్దేందుకు 2008లో వైఎస్ ‘ఆత్మీయుడు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతిగృహాలను పర్యవేక్షించేందుకు అప్పట్లో ఒక్కో మండల స్థాయి అధికారిని ఒక్కో హాస్టల్‌కు ‘ఆత్మీయుడి’గా నియమించారు. నవీన్‌మిట్టల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ ఆత్మీయులు హాస్టళ్లకు వెళ్లి మంచిచెడ్డలు విచారణ జరిపేవారు. దీనికితోడు నెలలో ఒకరోజు విద్యార్థులతో కలిసి వారికి పెట్టే భోజనం తిని అక్కడే నిద్రించేవారు. తొలినాళ్లలో కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలుచేసినా ఆ తర్వాత అటకెక్కించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కొందరు నిర్వాహకులు (వార్డెన్లు) రోజుల తరబడి వసతి గృహాల వైపు కన్నెత్తి చూడడం లేదు. విద్యార్థులకు అందజేయాల్సిన మెనూను వంటమనుషులకు అప్పగించి సొంత పనులు చూసుకుంటున్నారు.
రికార్డుల మాయ..
జిల్లాలోని 300 ప్రభుత్వ వసతిగృహాల్లో దాదాపు 20 వేల మందికిపైగా విద్యార్థులున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు విద్యార్థుల సంఖ్యను రికార్డుల్లో గిమ్మిక్కులు చేస్తున్నారు. ఇలా చేసిన చాలామందిని విధుల నుంచి తొలగించినప్పటికీ కొందరి ధోరణిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. గత ఏడాది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాస్టల్ విద్యార్థులకు ప్రతి ఆదివారం ఎగ్ బిర్యాని అందించే పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. దాని కోసం విద్యార్థుల మెస్ చార్జీలు కూడా పెంచారు.
అయినా ప్రస్తుతం కొన్నిచోట్లే బిర్యానీ పెడుతున్నారు. పలు వసతిగృహాల్లో విద్యార్థులకు కడుపునిండా సరైన భోజనం కూడా పెట్టడం లే దన్న ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులు పడుతున్న అవస్థలు బయటవారికి చెబితే వారిని వార్డెన్లు మరింత ఇబ్బందులకు గురిచేస్తారని కొన్నిప్రాంతాల్లోని వసతిగృహాల నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు వసతి గృహాల్లో లోపాలున్నప్పటికీ ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో అన్నీ బాగున్నాయని చెబుతుంటారు.
12 అంశాలపై నివేదిక కోరిన కలెక్టర్
సాక్షిలో ప్రచురించిన వరుస కథనాలపై కలెక్టర్ దృష్టిసారించడంతో వసతిగృహాల నిర్వాహకుల్లో కలకలం రేగుతోంది. ఇప్పటికే కలెక్టర్ ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను 12 అంశాలపై నివేదికలు కోరారు. హాస్టల్‌వారీగా నిర్వహణ ఎలా ఉంది.. ఏం కావాలి.. మెనూ అమలవుతుందా.. మౌలిక సదుపాయాల మాటేమిటి.. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది.. తదితర అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
ఇప్పటికే జిల్లాలోని హాస్టళ్ల మరమ్మతుల కోసం మంజూరైన రూ.5.65 కోట్లు, ప్రహరీ నిర్మాణాలకు మంజూరైన రూ.95 లక్షలతో ఎక్కడెక్కడ పనులు చేపట్టారు.. వాటి పురోగతి ఏమిటి.. అనే వివరాలు కూడా కలెక్టర్ ఆరా తీశారు. వీటిపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని ఈ నెల 14న హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చిన తరువాత సమీక్ష నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు.
ఇద్దరు వార్డెన్లకు మెమోలు..
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డెన్లకు మెమోలిచ్చినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి.మధుసూదనరావు సాక్షికి చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతిగృహాలను ఆకస్మిక తని ఖీలు చేస్తున్నామన్నారు. మంగళవారం రాత్రి పామరు, అడ్డాడ వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు లోపాలు గుర్తించినట్టు చెప్పారు. అడ్డాడ హాస్టల్‌లో ఆరుగురు, పామర్రు హాస్టల్‌లో తొమ్మిది మాత్రమే విద్యార్థులు ఉన్నారని, సంబంధిత వార్డెన్లకు నోటీసులు ఇచ్చామన్నారు. వారి వివరణ సంతృప్తికరంగా లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా, వారికి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించే వార్డెన్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదని మధుసూదనరావు స్పష్టం చేశారు.