
కొత్త ఇసుక విధానానికి ఆమోదం
♦ ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు
♦ జనవరి ఒకటి నుంచి ఎన్టీఆర్ ఉచిత వైద్య పరీక్షలు
♦ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో కొత్త ఇసుక విధానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ విధానం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఇసుక విధానంతోపాటు పలు ముఖ్య అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
వివరాలు ఇలా ఉన్నాయి... ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇసుక విధానంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆర్థిక మంత్రి అధ్యక్షునిగా గనులు, కార్మిక, జలవనరుల శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ ఉపసంఘం ఇసుక విధానంపై అధ్యయనం చేసి మంత్రివర్గానికి నివేదిక ఇచ్చేలోపు సూత్రప్రాయంగా కొత్త విధానాన్ని అమలు చేస్తారు. ఇసుక లభ్యత, పరిసరాలను బట్టి ధరపై నిర్ణయిస్తారు.
లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్న ప్రాంతాన్ని ఒక రీచ్‌గా గుర్తించి ప్రత్యక్ష వేలం ద్వారా ఏడాదికి లీజు కేటాయిస్తారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో జేసీ చైర్మన్, జెడ్పీ సీఈఓ వైస్‌చైర్మన్, మైనింగ్ ఏడీ కన్వీనర్‌గా కమిటీలు నియమిస్తారు. నిబంధనలకు లోబడి పట్టా భూముల్లోనూ ఇసుక అమ్ముకోవచ్చు. రోబో శాండ్‌ను ప్రోత్సహించేందుకు విద్యుత్, వ్యాట్‌లలో పూర్తి సబ్సిడీ, సీనరేజీలో 50 శాతం సబ్సిడీ అందిస్తారు.
ఆస్పత్రుల్లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం...
► జనవరి ఒకటో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం అమలు. అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రుల్లో ఆ రోజున పథకం ప్రారంభం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సాయంత్రం నాలుగు గంటలకు సీఎంచే పథకం ప్రారంభం. జనవరి 15 నుంచి కమ్యూనిటీ ఆస్పత్రులు, 31వ తేదీ నుంచి పీహెచ్‌సీల్లో ఈ పథకం అమలు. పథకం కింద రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రొక్యూర్‌మెంట్ విధానికి అనుమతి.
► ఆస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణుల కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం. తల్లీబిడ్డను ప్రభుత్వమే ఇంటికి తీసుకెళ్లి దించే ఏర్పాటు. చికిత్స, ఆరోగ్య సలహాల కోసం 102 కాల్ సెంటర్ ఏర్పాటు.
► ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎస్‌డీ నియామకానికి అనుమతి. రెండేళ్ల కాలపరిమితో ఓఎస్‌డీని నియమించుకునే అవకాశం.
► రాష్ట్రంలోని నాన్ షెడ్యూల్డ్ ప్రాంతంలోని 50 గిరిజన హాస్టళ్లు గిరిజన రెసిడిన్షియల్ పాఠశాలలుగా మార్పు. 50 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు 600 పోస్టుల మంజూరు. ఎక్కువ జనాభా, ఆర్థిక పరిపుష్టి ఉన్న 659 గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల బిగించడానికి అనుమతి. ప్రస్తుతం అక్కడ ఉన్న 3.5 లక్షల సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు. దీనిద్వారా రూ.34 కోట్ల ఆదా.
► 1956 హిందూ ఆడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టంలోని సబ్-సెక్షన్-4 అండర్ సెక్షన్-18కి సవరణ. దీనిద్వారా విడాకులు తీసుకున్న భార్య పోషణ బాధ్యత భర్తపైనే. ఒకవేళ భర్త సన్యాసం తీసుకుంటే, కనబడకుండాపోతే, మానసిక స్థిరత్వం లేకుండా ఉంటే ఉమ్మడి కుటుంబం ఆమె పోషణ బాధ్యత తీసుకోవాలి. అవిభక్త ఉమ్మడి కుటుంబానికే ఈ నియమం వర్తింపు.
► అంగన్‌వాడీల వర్కర్ల జీతం రూ.4,200 నుంచి రూ.ఏడు వేలు, మినీ వర్కర్ల జీతం రూ.2,950 నుంచి రూ.4,500, హెల్పర్ల జీతం రూ.2,200 నుంచి రూ.4,500కి పెంచేందుకు అనుమతి.
► నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు,పిడతాపోలూరులో మినీ స్టేడి యం నిర్మాణం కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు 17.78 ఎకరాలు కేటాయింపు. పొదలకూరు మండలం తోడేరులో 11.54 ఎకరాలను మినీ స్టేడియం కోసం కేటాయింపు.
► విశాఖపట్నంలో జనవరి 10, 11, 12 తేదీల్లో జరిగే ఏపీ ఇన్వెస్ట్ మీట్, సీఐఐ పార్టనర్‌షిప్ సదస్సు విజయవంతం చేసేందుకు మంత్రులు బాధ్యత తీసుకోవాలి.