
దసరాకు ఇంటికి వెళ్లేదెలా అని వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించడంతో బస్టాండ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఏ బస్సు చూసినా కాలుమోపలేని స్థితిలో కనిపిస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఇదే అదనుగా బస్ చార్జీలు పెంచేయడంతో వీరంతా లబోదిబోమంటున్నారు. సొంతూర్లకు రావాలని పరితపిస్తున్న వారికి దోపిడీ కళ్లెదుటే కనిపిస్తోంది. నానా బాధలు పడి ఎలాగోలా ఊర్లకు రావాలని కదులుతున్నారు. భారీగా ఛార్జీల బాదుడుకు గురవుతున్నా సీటు లేక....బస్సుల్లో అదనపు కుర్చీలు వేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోపక్క ప్రైవేటు ట్రావెల్స్ నిలుపుదోపిడీ చేస్తుండగా, ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రత్యేకం పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు.
సాక్షి కడప : దసరా సందర్భంగా ఇంటికి చేరుకునే వారికి బస్‌చార్జీలు మోతెక్కిస్తున్నాయి. డిమాండ్‌ను ఆసరా చేసుకుని ఆర్టీసీతోపాటు ప్రైవేట్ రవాణా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి పడుతున్న కష్టాలతోపాటు రిజర్వేషన్ల ఫలితంగా సీట్లు లభించని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కడ చూసినా సీటుకు డిమాండ్ ఏర్పడడంతో అడిగినంత ఇచ్చుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ రోజులు సెలవులు కావడంతో.. జనాలంతా స్వగ్రామాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది ప్రత్యేకంగా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు.
ప్రతిసారి పండుగ సమయంలో ఎదురవుతున్న పరిస్థితే ఈసారి కూడా ఎదురవుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో దాదాపుగా ఇప్పటికే సీట్లన్నీ బుక్ అయిపోగా.. ఆర్టీసీలో పరిస్థితి గగనంగా మారుతోంది. డబ్బులు పెట్టినా టిక్కెట్లు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సీట్లు లభిస్తున్నాయి. ఎలాగూ ప్రైవేటు బస్సుల్లో అయితే డిమాండ్ సృష్టించి మరీ డబ్బులు లాగేస్తున్నారు. సీట్లు అయిపోయాయని చెబుతూ....ప్రయాణికులను రెండు సీట్ల మధ్యలో సాధారణ కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. సాధారణ బస్సులలో సీట్లు çఫుల్ కాగానే.. ప్రత్యేక సర్వీసులను కూడా నడపేందుకు ఆర్టీసి సన్నద్దమవుతోంది. గతనెల 28 నుంచి అక్టోబరు 13 వరకు అంటే దాదాపుగా 16రోజుల పాటు పిల్లలకు సెలవులు రావడంతో అందుకు అనుగుణంగా టిక్కెట్లు బుక్ చేయించుకున్నారు.
ప్రైవేటు దోపిడీ
జిల్లాలో ప్రైవేటు రవాణా దందా కొనసాగుతోంది. విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల నుంచి రావాలంటే పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సుల ముసుగులో ప్రయాణీకులను దోచుకుంటున్నారు. హైదరాబాదులో టిక్కెట్ రూ.750 నుంచి ప్రస్తుతం రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగిపోయింది. అంతకంతకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బహిరంగంగానే ఆన్‌లైన్ సాక్షిగా దోపిడీ కొనసాగిస్తున్నారు.జిల్లా మీదుగా విశాఖపట్టణం, బెంగుళూరు, హైదరాబాద్, ముం బై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రావడానికి అవసరమైన అన్ని వనరులను వెతుకుతున్నారు. బస్సులు మొదలుకొని రైళ్లు, విమానాలు, ప్రత్యేక వాహనాలు ఇలా ఎలా అవకాశం ఉంటే అలా రావడానికి ప్రయత్నిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రైళ్లు, బస్సుల్లో సీట్లు రిజర్వు కావడంతో కష్టాలు పడుతున్నారు.
బస్టాండ్లలో తప్పని తిప్పలు
ఆర్టీసీ అధికారులు దూర ప్రాంత ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 150 సర్వీసులను వినియోగిస్తున్నారు. ప్రత్యేక సర్వీసుల పేరుతో విజయవాడ, తిరుపతి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదులకు నడుపుతున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. బస్సులు అక్కడికి వెళ్లడంతో స్థానికంగా ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment