సాయం చేయమంటే బెదిరిస్తున్న ఆరోగ్యశ్రీ అధికారులు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పథకాలు ఆయన అకాల మరణంతో నీరుగారిపోయాయి. పేదల ప్రాణాలకు భరోసా ఇవ్వడానికి ఆయన ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో అయోమయం నెలకొంది. ఈ పథకం ద్వారా స్వాంతన పొందుదామని కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లిన నిరుపేద రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో చోటుచేసుకుంటున్న మోసాలు వారి కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం లింబ-బి గ్రామంలో ఓ బాధితుడు పడుతున్న పాట్లు వింటే ఈ పథకం అధికారులు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధమవుతుంది. ఇంతకాలం ఈ గ్రామంలోని ప్రజల మంచి, చెడులలో పాలుపంచుకుంటూ కిషన్‌రావ్ గ్రామానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ప్రతి విషయంలోనూ గ్రామస్థులకు అండగా నిలిచిన ఈయనకు ప్రస్తుతం చెప్పలేనంతగా కష్టం వచ్చిపడింది. ఎప్పుడూ చలాకీగా ఉండే ఈయనకు గుండె నొప్పి వచ్చింది. సికింద్రాబాద్ సిగ్మా ఆస్పత్రిలో చేరిన కిషన్‌రావ్‌కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అనుమతి లభించింది. కానీ ఆయన ఆరోగ్యం ఓపెన్ హర్ట్ సర్జరీ కోసం సహకరించదని, గుండెకు స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో మళ్లీ ఆరోగ్యశ్రీ అధికారులను సంప్రదిస్తే సమస్యను పూర్తిస్థాయిలో వినకుండానే తిరిగి ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం లేఖ ఇచ్చారు.
కిషన్‌రావ్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో లక్షా 60వేలు రూపాయలు అప్పుచేసి మరీ స్టంట్ వేయించారు. ఆరోగ్యశ్రీలో అయితే సహాయం అందలేదు. కనీసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానైనా సహాయం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ మెట్లెక్కారు. ఐతే ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ ద్వారా సహాయం చేశామని అధికారులు తెలిపారు. తమకు ఎలాంటి సాయం అందలేదని మొరపెట్టుకున్నా ఫలితంలేదు. ఆ అధికారులు ఆయన మాటలు వినలేదు. పైగా కేసులు వేస్తామంటూ కిషన్‌రావ్‌తో పాటు ఆయన బంధువులను అధికారులు బెదిరించారు.
బడుగులను కాపాడేందుకు మహానేత గొప్ప మనసుతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి చివరకు ఇలా తయారైంది. సాయం అడిగితే బెదిరించే స్థాయికి వెళ్లారు అధికారులు. ఈ పథకం ఈ విధంగా నీరుగారడాన్ని పేద ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.