పుష్కర ఘాట్లకు అర కిలోమీటరు నడవాల్సిందే..
రాజమండ్రి (తూర్పు గోదావరి) : పుష్కరాల్లో గోదావరి నదీ స్నానం చేయాలనుకునే వారికి అర కిలో మీటరు నడక ప్రయాణం తప్పకపోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కనీసం అర కిలో మీటరు తప్పక నడిస్తేగానీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకోలేరు. పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా వసతి సౌకర్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి.. గోదావరి పుష్కరాలకు పూర్తి కేంద్ర బిందుగా మారింది. రాష్ట్ర పరిధిలో ప్రతి రోజూ 25 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తుండగా, అందులో 12 లక్షల మంది భక్తులు ఒక్క రాజమండ్రికి రాకపోకలు సాగిస్తారని అంచనా.
రద్దీ దృష్ట్యా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ల వద్దకు ఎటువంటి వాహనాలను అనుమతించకూడదని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఘాట్లకు ఆరు వందల మీటర్ల దూరంలోనే ఎలాంటి వాహనాలనైనా నిలిపివేయనున్నారు. అక్కడ నుంచి కాలి నడక ద్వారానే భక్తులు ఘాట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అసలు నడవలేని వృద్ధుల కోసం కొన్ని వీల్ చైర్లు అందుబాటులో ఉంచుతున్నారు.
పుష్కర స్నానాల కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సు, రైళ్లతో పాటు ప్రైవేట్ వాహనాలలో రాజమండ్రికి చేరుకున్నా వారందరినీ ఉచిత బస్సులోనే ఘాట్ల వద్దకు చేర్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ప్రదేశాల నుంచి ప్రయాణీకులను పుష్కర ఘాట్ల వద్దకు చేర్చడానికి 300 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు.
సీలేరు ప్రాజెక్టుతో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి నీటి విడుదలకు అంగీకారం పొందడం ద్వారా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కింద ఘాట్లకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా చూసే ప్రయత్నాల్లో ఉన్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఘాట్లలో నీటి ఇబ్బందులు ఏర్పడితే షవర్ సిస్టం ద్వారా భక్తులు స్నానాలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.