వేగంగా రాములోరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
► రూ.3 కోట్ల టీటీడీ నిధులతో పనులు
► 70వేల మంది వీక్షించేలా కల్యాణ వేదిక
► పనులు వేగవంతానికి ఈఓ ఆదేశాలు
► గతంలో జరిగిన లోపాలు సరిదిద్దుకునేనా?
రాష్ట్రంలో రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టపై టీటీడీ అధి కారులు ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల ను వైభవంగా నిర్వహించాలని, అం దుకోసం ముందస్తుగా అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. కల్యాణోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్న దృష్ట్య తగిన ఏర్పాట్లు చేయడంలో ముందుండాలని టీటీడీ ఈఓ అధికారులకు ఆదేశించారు.
ఒంటిమిట్ట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 4 నుంచి 14 వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ఒంటిమిట్టపై దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాల పనుల వేగవంతానికి సంబంధించి ఆయా శాఖల అధికారులకు టీటీడీ ఈఓ సాంబశివరావు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లోని ఈఓ అధికారులతో రాములోరి కల్యాణోత్సవం..ఆన్‌గోయింగ్ పనులు, ఉత్సవ విడిది, గార్డెనింగ్, కల్యాణవేదిక అభివృద్ధి అంశాల పురోగతిపై సమీక్షించారు.
70 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు: వచ్చేనెల 10న జరిగే రాములోరి కల్యాణానికి టీటీడీ భారీ సన్నహాలే చేస్తోంది. 70 ఎకరాల స్థలంలో కడప–రేణిగుంట రహదారి వెంబడి వివిధ రకాల మొక్కలను నాటారు. కల్యాణవేదిక వద్ద చదును పనులు పూర్తి చేశారు. 70వేల మందికిపై భక్తులు వీక్షించడానికి అనుకూలంగా ఆధునికమైన పద్ధతిలో చలువపందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కల్యాణ వేదికను రూపొందిస్తున్నారు. రామాలయం చుట్టూ హరితవనం ఏర్పాటు చేస్తున్నారు.
కల్యాణానికి తరలిరానున్న సీఎం, గవర్నరు: రాములోరి కల్యాణానికి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, గవర్నరు నరసింహన్‌తోపాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తరలివచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఆ దిశగా టీటీడీ అవసరమైన ఏర్పాట్లుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. విడిది, వసతి సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ ముందుగానే సమాయత్తమవుతోంది.
యాత్రీకుల కోసం విడిది సముదాయ భవనం: కోదండరాముని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, యాత్రీకులు, పర్యాటకుల కోసం రూ.5కోట్లతో యాత్రీకులు విడిది సముదాయభవనం నిర్మిస్తున్నారు. దేవుని మాన్యంలో ఈ భవనం నిర్మాణం పూర్తికావస్తోంది. ఈ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ భవనం మొదటి అంతస్తులో 8 గదులు, మీల్స్ హాల్, రెండవ అంతస్తులో 7 గదులను వందమంది యాత్రీకులు విశాంత్రి తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మూడవ అంతస్తులో ఏడు గదులను నిర్మిస్తున్నారు. వివిధ స్టోరేజి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
గత సంవత్సరం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటచేసుకున్న పొరపాట్లను టీటీడీ సరిదిద్దుకునేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సరైన రీతిలో భోజన వసతి కల్పించలేదు. ఆర్టీసీ బస్సులను ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేయలేదు. ఎంతో మంది భక్తులు కల్యాణం చూడలేక వెనుదిరిగారు. భక్తులు మరుగుదొడ్లు, మంచినీటి వసతి పుష్కలంగా కల్పించలేకపోయారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఖాకీలకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం పోలీసువర్గాలు పెదవి విరిచాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీటీడీ ముందుస్తు ప్రణాళికతో ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏమేరకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.