ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు డబ్బు సంచులతో కృత్రిమ ఉద్యమాలు నిర్వహిస్తున్నారని.., తెలంగాణ ఉద్యమం త్యాగాలతో, రక్తతర్పణతో నడిచిందని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని, 29న హైదరాబాద్‌లో జరిగే సకల జనుల భేరిని విజయవంతంచేయాలని కోరుతూ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మయ్య మాట్లాడుతూ... సీమాంధ్రులు మనిషికి రోజుకు రూ.500 ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారని, తెలంగాణ ప్రజలు వారసత్వంగా, సంప్రదాయంగా సాహసమైన ఉద్యమాన్ని భావితరాల కోసం నిర్మించారని పేర్కొన్నారు.
సీట్లు, ఓట్ల కోసం చేసే ఉద్యమాలను తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీకంటే ప్రజలు ముఖ్యమని మాట్లాడుతున్నాడని.., ‘నీవు ఎప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రివి అయ్యావు... నిన్ను ఎవరు ఎన్నుకున్నారు... నువ్వు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రివి’ అంటూ ఎద్దేవా చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కిరణ్ సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని, ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిలా అప్రజాస్వామికంగా మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చివరి బంతి వరకు పోరాడుతామని అంటున్నాడు కానీ, తెలంగాణ ప్రజలకు ఫిరంగుల ఆటకూడా తెలుసని, సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. ‘నీవు చిన్న పిల్ల వాడివి.. తెలంగాణ చరిత్ర నీకు తెలియదు. నిన్ను కూలదోస్తామని చెప్పిమరి నైజాం నవాబుకు గోరికట్టిన చరిత్రను తెలుసుకో’ అని ముఖ్యమంత్రికి సూచించారు.
ఓటమితో వెనుదిరిగిన చరిత్ర తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు లేదని చెప్పారు. హైదారాబాద్‌లో కబ్జా భూములు, సంపదను కాపాడుకుంటూ పెత్తనం చేసేందుకే తెలంగాణను అడ్డుకుంటున్నారని చెప్పారు. తెలంగాణను అడ్డుకుంటే సీమాంధ్రుల ఆర్థిక వనరులు దెబ్బతిసేలా కార్యచరణ రూపొందించి ఉద్యమాలు సాగిస్తామని హెచ్చరించారు. న్యూడెమోక్రసీ కేంద్ర సంఘం నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని చెప్పి సంబరాలు చేసుకున్న సమయంలో కుంటి సాకులతో అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే ఈసారి ఊరుకోమని, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడాలని, తెలంగాణ ప్రజలు దేనికయినా సిద్ధం కావాలని అన్నారు. మూడు లక్షల మంది ప్రజలను ముంచేందుకు కుట్ర జరుగుతుందని, పోలవరం నిర్మాణాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న బొగ్గును తరలించేందుకు కుట్ర జరుగుతోందని, ఇక్కడ సంపదతో ఆంధ్ర ప్రాంతంలో ప్రయోజనం కలిగించేలా పాలకులు ప్రణాళిక రచిస్తున్నారని అన్నారు.
పీవోడబ్లూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, పార్టీ రాష్ట్ర నాయకులు గోవర్దన్ మాట్లాడుతూ.. తోడేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసే పరిస్థితి ఉందని తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు ఉద్యమం సాగుతుందన్నారు. సీమాంధ్రుల ఆటలు సాగనీయమని, ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తొలుత స్థానిక డిగ్రీ కళాశాల నుంచి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలు చేతబూని ప్రదర్శనగా బయలుదేరి ఇల్లెందు క్రాస్ రోడ్, కలెక్టరేట్, వైరా రోడ్, గాంధీచౌక్, మయూరీ సెంటర్ మీదుగా రిక్కా బజార్ స్కూల్‌కు చేరుకున్నారు. ఈ సభలో అరుణోదయ కళాకారులు ఆటపాటలతో సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌని ఐలయ్య, ముక్తార్ పాషా, జడ సత్యనారాయణ, సీతారామయ్య, రాములు, హన్మంతరావు, గిరి,టీఎన్‌జీవో నాయకులు నందగిరి శ్రీను, రమణ యాదవ్, రచయితల వేదిక నాయకులు తిరుమల రావు, భాస్కర్, సుగుణారావు, పీడీఎస్‌యూ నాయకులు నర్సింహారావు, బానూ చందర్, రాకేష్ పాల్గొన్నారు.
'కృత్రిమ ఉద్యమాలను తిప్పికొట్టాలి'
Published Sat, Sep 28 2013 6:46 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM
Advertisement