యలమంచిలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర బంద్‌లు, నిరసనలతో వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆఖరులో ముదురునారుతో ఆలస్యంగా వరినాట్లు పడ్డాయి. కనీసం తిండిగింజలైనా దక్కించుకోవాలనే ఆశతో అన్నదాతలు ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. దాదాపు 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అదీ సీజన్ ఆఖరులోనే. దీంతో మొత్తంగా 56వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు.
యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో పరి స్థితి దయనీయంగా ఉంది. ఎలాగైనా పంటను దక్కించుకోవాలన్న ఆరాటంలో రైతులు ప్రస్తుతం డీఏపీ, గ్రోమోర్, ఎంవోపీ ఎరువులకంటే యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎరువుల సబ్సిడీపై పోషకాధారిత విధానం ప్రవేశపెట్టిన తర్వాత డీఏపీ, కాంప్లెక్స్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది యూరియాకు వర్తించకపోవడంతో రైతులు దానివైపే మొగ్గు చూపుతున్నారు.
కేటాయింపుల మేరకు కేంద్రం నుంచి తెప్పించడంలో రాష్ట్రం విఫలం కావడంతో యూరియాకు కొరత ఏర్పడుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో దుకాణాలు మూ తపడటం, రవాణాకు ఇబ్బందులను సాకుగా చూపి ఎరువులను ఎక్కువ ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మార్కెట్ ధరకంటే రు.80-100ల వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఇక ఎక్కువ డిమాండ్ ఉన్న యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి ఎక్కువగా గుంజుతున్నారన్న వాదన ఉంది.
అధికారులు సమ్మెలో ఉండటంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టవేసేవారు లేకుండా పోయారు. ప్రైవేట్ వ్యాపారులు, పీఏసీఎస్‌ల్లో 28-28-0 రకం ఎరువును రూ.1150లకు, 20-20-13ను రూ.919లకు, ఎస్‌ఎస్‌పీ రూ.352లకు అమ్ముతున్నారు. ఎంవోపీ రూ.915లు, డీఏపీ రూ.1181లు, యూరియా రూ.284 నుంచి రూ.298లకు అమ్ముతున్నారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంటను దక్కించుకోవాలన్న ఆత్రంతో రైతులు తుని, అనకాపల్లి తదితర పట్టణాలకు వెళ్లి ఎంత ధరకైనా అన్నట్టు ఎరువులు కొనుగోలు చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తెచ్చుకుంటున్నారు.
యూరియాకు కృత్రిమ కొరత.. బ్లాక్ మార్కెట్‌లో విక్రయం
Published Fri, Oct 11 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement