సమావేశంలో మాట్లాడుతున్న బీవీఎస్ మూర్తి
సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కన్ను తెరచి, విజయపథంలో నడుస్తున్న ఆంధ్రుల బ్యాంక్ త్వరలో జరగనున్న విలీనం తరువాత ‘ఆంధ్ర’ శబ్దం కోల్పోవడం దురదృష్టకరం. విలీనం తరువాత కూడా ఆంధ్రాబ్యాంక్ పేరే కొనసాగాలి’ అని కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి కోరారు. కళాగౌతమి ఆధ్వర్యాన ధాన్యంపాకలు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన చర్చావేదికలో కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ మూర్తి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రుల కోడలని, పేరులో ‘ఆంధ్ర’ శబ్దం తీసివేయడం ఆంధ్రుల అస్తిత్వానికే మచ్చని పేర్కొన్నారు.
‘ఆంధ్రత్వ మాంధ్రభాషా చ–అపి ఆంధ్రదేశ స్వజన్మభూః–తత్ర యాజుషీశాఖానాల్పస్య తపః ఫలమ్’ అని తమిళుడైన అప్పయ్య దీక్షితులు అన్నారని, అంటూ, ‘అల్పతపస్సు చేసిన నాబోంట్లకు ఆంధ్రత్వం ఎలా కలుగుతుంద’ని ఈ శ్లోకంలో ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి నివసించిన కుటీరానికి ‘ఆంధ్రకుటీరం’ అని, నడిపిన పత్రికకు ‘ఆంధ్రి’ అని, రచనలకు ‘ఆంధ్రపురాణం’ ‘ఆంధ్ర రచయితలు’ అని పేరు పెట్టుకున్నారని చెప్పారు. విలీనంలోని మంచిచెడ్డలపై తాము వ్యాఖ్యానించడం లేదన్నారు. తెలుగు సారస్వత పరిషత్ వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీబీ సంజీవరావు మాట్లాడుతూ, ప్రాచీన భాషల అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారని ఆవేదన చెందారు.
ఆంధ్ర మహాభారతం పుట్టిన గడ్డ, తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం పేరు పాలకులకు గుర్తుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. నటరాజ నృత్యనికేతన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తెలుగువారంటే కేంద్రానికి చిన్నచూపు, లోకువ అని విమర్శించారు. ఫిలాంత్రఫిక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజా అద్దంకి యోనా మాట్లాడుతూ, విలీనం తరువాత ఏర్పడే బ్యాంక్‌కు ఆంధ్రాబ్యాంక్ పేరునే ఖరారు చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల మాట్లాడుతూ, కేంద్రం దిద్దుబాటు చర్య తీసుకునే విధంగా ఒత్తిడి చేయాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు ముంగండ సూర్యనారాయణ, లక్కోజు వీరవెంకట సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment