చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం చాంబర్ ఎన్నికల పోరు సోమవారం జరగనుంది. మెయిన్ రోడ్డులోని చాంబర్ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జవ్వార్, మద్దుల మురళీకృష్ణ –దొండపాటి సత్యంబాబు, గ్రంధి రామచంద్రరావు ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. 2019–21 రెండేళ్ల కాలవ్యవధికి నిర్వహించే నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు –1, ప్రధాన కార్యదర్శి –1, ఉపాధ్యక్షులు– 2, కోశాధికారి–1, సంయుక్త కార్యదర్శి–1, ట్రస్ట్ బోర్డు సభ్యులు – 3, డైరెక్టర్లు – 15 పదవుల కోసం ఎన్నికలు జరగున్నాయి. ఒక్కొక్క ప్యానల్ నుంచి 24 మంది సభ్యులతో మొత్తం రెండు ప్యానల్స్ నుంచి 48 మంది పోటీలో ఉన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా కొయ్యాన కుమారి, నమ్మి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు.
2810 మంది ఓటర్లు
ఎన్నికల్లో 2,810 మంది చాంబర్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీరిలో 2710 మంది పురుషులు, వందమంది మహిళా ఓటర్లు ఉన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల కమిటీ అధ్యక్షులు మారిశెట్టి వెంకటరామారావు, గమిని రంగయ్య మాట్లాడుతూ ఎన్నికలు పూర్తి అయిన గంట తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, ఫలితాలు ఎంత రాత్రయినా వెలువరిస్తామన్నారు.
అభ్యర్థులు వీరే..
ఒక ప్యానెల్లో.. అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ జవ్వార్, గౌరవ కార్యదర్శిగా మద్దుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా వంటెద్దు సూరిబాబు, కాలేపు వెంకట వీరభధ్రరావు, సంయుక్త కార్యదర్శిగా వెత్స వెంకట సుబ్రహ్మణ్యం(బాబ్జీ), కోశాధికారి బలభధ్ర వెంకటరాజు(రాజా) పోటీపడుతున్నారు. మరో ప్యానల్లో అధ్యక్షుడిగా దొండపాటి సత్యంబాబు, కార్యదర్శిగా గ్రంధి రామచంద్రరావు, ఉపాధ్యక్షులుగా మండవల్లి శివన్నారాయణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, సంయుక్త కార్యదర్శిగా దేవత సూర్యనారాయణ మూర్తి, కోశాధికారిగా మజ్జి రాంబాబు పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment