అక్కడ నో పర్మిట్‌.. ఇక్కడ రైట్‌ రైట్‌ | Arunachal Pradesh Government Cancels Illegal Private Bus Registrations | Sakshi
Sakshi News home page

అక్కడ నో పర్మిట్‌.. ఇక్కడ రైట్‌ రైట్‌

Published Mon, Jun 12 2017 9:36 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

అక్కడ నో పర్మిట్‌.. ఇక్కడ రైట్‌ రైట్‌

అక్కడ నో పర్మిట్‌.. ఇక్కడ రైట్‌ రైట్‌

ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా రంగంలోకి దిగి బస్సులకు ఏపీలో రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ఒత్తిళ్లు ఆరంభించింది.

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసిన అరుణాచల్‌ప్రదేశ్‌
రద్దైన వాటిలో 600 బస్సులు ఆంధ్రప్రదేశ్‌వే
ఆ బస్సులకు రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో చేసేందుకు రంగం సిద్ధం
ఇందుకోసం ట్రావెల్స్‌ మాఫియా ఒత్తిళ్లు
గుంటూరు, పశ్చిమగోదావరి రవాణా అధికారులతో కమిటీ ఏర్పాటు
నివేదిక రాకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించిన రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు


సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల రిజిస్ట్రేషన్లు అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం రద్దుచేసింది. ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా డబ్బు దండుకుని తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్న వీటి పర్మిట్లను ఈ నెల ఆరో తేదీన రద్దుచేసింది. టూ ప్లస్‌ వన్‌ బెర్తులతో, అనుమతిలేని లే అవుట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 900 బస్సుల వరకూ తిరుగుతున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 600, తెలంగాణలో 300 వరకూ ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లతో పాటు పర్మిట్లు కూడా రద్దు కావడంతో ట్రావెల్స్‌ యాజమాన్యాలు బస్సుల్ని తిప్పేందుకు అవకాశం లేకుండాపోయింది.

రోడ్డెక్కితే సీజ్‌..: అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం పర్యాటక ప్రాంతం కావడం, పర్మిట్‌ పన్ను ఏడాదికి రూ.17 వేలు మాత్రమే ఉండటంతో ట్రావెల్స్‌ యాజమాన్యాలు అక్కడ రిజిస్ట్రేషన్లు చేయించి ఇక్కడ నడుపుతున్నాయి. రూ.17 వేలు చెల్లిస్తే ఆలిండియా పర్మిట్‌ పొందొచ్చు. అదే ఇక్కడ పర్మిట్లు పొందాలంటే మూడు నెలలకోసారి ఒక్కో సీటుకు ఏపీలో అయితే రూ.3,750, తెలంగాణలో రూ.3,675 చెల్లించాలి. పన్నులు తప్పించుకునేందుకు ట్రావెల్స్‌ యాజమాన్యాలు అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్లు, ఆలిండియా పర్మిట్లు పొందుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. తమ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేయించి తమ రాష్ట్రం మీదుగా నడపడం లేదని అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు లేకుండా బస్సులు రోడ్డెక్కితే సీజ్‌ చేసే అధికారం రవాణా శాఖకుంది.

రంగంలోకి రవాణా మాఫియా
ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా రంగంలోకి దిగి ఆ బస్సులకు ఏపీలో రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ఒత్తిళ్లు ఆరంభించింది. రద్దయిన ప్రైవేటు ట్రావెల్స్‌లో అధికార పార్టీ ఎంపీకి చెందిన ట్రావెల్స్‌ ఉండటంతో ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

టూ ప్లస్‌ వన్‌ బెర్తుల రిజిస్ట్రేషన్‌లకు కేంద్రం మార్గదర్శకాలు: టూ ప్లస్‌ వన్‌ బెర్తులతో ఏర్పాటైన బస్సులకు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలిచ్చింది. బస్సు బాడీ బిల్డింగ్‌తో పాటు లే అవుట్, ఏఐఎస్‌–119 నిబంధనల ప్రకారం ఉంటే బస్సు రిజిస్ట్రేషన్‌ చేయవచ్చని కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వాటి ప్రకారం..

కేంద్ర మోటారు వాహన చట్టం ప్రకారం నిలువు బెర్తులు ఏర్పాటు చేయకూడదు. ఏర్పాటు చేయాల్సి వస్తే.. బస్సులో ప్రస్తుతం ఉన్న 37 బెర్తులను 24కు తగ్గించాలి..

బస్సు పొడవు తగ్గించాల్సి ఉంది..

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వీలుగా బస్సు బాడీ బిల్డింగ్‌ రూపొందించాలి.
బస్సు లేఅవుట్, బాడీ బిల్డింగ్‌ కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందీ లేనిదీ సంబంధిత మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి ఆమోదించాకే రిజిస్ట్రేషన్‌ చేయాలి.

కమిటీ నివేదిక రాకుండానే..
బస్సు లేఅవుట్‌ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా.. అన్నది నిర్ధారించేందుకు రవాణా కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లతో (ఎంవీఐ) సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక రాకుండానే రవాణా మంత్రి అచ్చెన్నాయుడు ప్రైవేటు బస్సులకు రిజిస్ట్రేషన్లు ఏపీలోనే చేయించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ బస్సులు ఆగితే.. ఆర్టీసీకి వరమే!
సాక్షి, అమరావతి బ్యూరో: అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు రద్దయిన బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో 600 దాకా ఉన్నాయి. వాటిని సీజ్‌ చేస్తే నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీకి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఏటా అక్రమంగా తిరిగే ప్రైవేటు బస్సులతో రూ.1400 కోట్ల వరకూ నష్టపోతున్న ఆర్టీసీకి అదో పెద్ద వరమే.

ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం
అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరైన 2+1 స్లీపర్‌ బస్సులు ప్రత్యేకంగా విజయవాడ – హైదరాబాద్, విశాఖపట్నం – హైదరాబాద్‌ – షిర్డీ మ«ధ్య అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. అవి రద్దయితే ఆర్టీసీ ఆక్యుపెన్సీ గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల ఏటా దాదాపు రూ.400 కోట్ల రాబడి పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వం చేయూతనిస్తే.. ఏపీఎస్‌ ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 11,800 పైగా బస్సులు ఉన్నాయి. అందులో ఏసీ 2,700, స్లీపర్‌ 5, డీలక్స్‌ 613, ఎక్సైప్రెస్‌ 2,117, ఇతర బస్సులు 5,678 దాకా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టర్‌ అయి ఉన్న ప్రైవేటు బస్సులను సీజ్‌ చేస్తే వాటికి దీటుగా ఆర్టీసీ బస్సులను సమకూర్చుకోవాలి. ఇప్పటికే సంస్థ అప్పుల్లో ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆశించిన కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయూతనిస్తే నూతన బస్సులు కొనుగోలు చేయవచ్చు.     
 
నేడు ఉన్నతాధికారుల ప్రత్యేక భేటీ..
అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుందని అధికారవర్గాలు తెలిపాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టర్‌ అయిన బస్సులను రద్దుచేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌తో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీతో పాటు రవాణాశాఖ కమిషనర్లు పాల్గొంటారు. ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement