ఇదండీ.. బాబుగారి  కార్పొరేషన్‌ కహానీ | Aryavysya Corporation Established By TDP Government Before Elections | Sakshi
Sakshi News home page

ఇదండీ.. బాబుగారి  కార్పొరేషన్‌ కహానీ

Published Tue, Apr 2 2019 8:44 AM | Last Updated on Tue, Apr 2 2019 8:44 AM

Aryavysya Corporation Established By TDP Government Before Elections - Sakshi

సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ మార్చి 11 నుంచి అమల్లోకి రాగా, సరిగ్గా దానికి 20 రోజులుగా ముందుగా.. అంటే ఫిబ్రవరి 19వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ప్రకటించి చైర్మన్‌ను నియమించారు. అప్పటికే నాలుగున్నర సంవత్సరాలకుపైగా పరిపాలించిన ఆయనకు ఏనాడూ గుర్తుకురాని ఆర్యవైశ్యులు.. ఎన్నికలు రావడానికి కేవలం 20 రోజులే ఉందనగా గుర్తుకురావడం ఆ సామాజిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.

కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన 20 రోజులకే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, అందువలన ఏ ఒక్కరికీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధి చేకూర్చలేకపోయామని టీడీపీ పాలకులు ముసలి కన్నీరు కార్చడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కేవలం ఓట్ల కోసమే ఎన్నికల కోడ్‌ రావడానికి 20 రోజులు ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మభ్యపెట్టేందుకు ప్రయత్నించడాన్ని అర్థం చేసుకున్న ఆ సామాజికవర్గం ప్రజలు నిన్ను నమ్మం బాబూ అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చేయకపోగా, మళ్లీ ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తమను నయవంచనకు గురిచేసిన చంద్రబాబుకు, టీడీపీకి ఈ నెల 11న జరిగే పోలింగ్‌లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉన్నారు.

ఒక్కరికీ రుణం అందకపోవడంతో అసంతృప్తి వెల్లువ...
హడావిడిగా ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు, చైర్మన్‌ నియామకం వంటివి ఓట్ల కోసం మినహా ప్రజలకు లబ్ధిచేకూర్చేందుకు కాదని భావించని ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు రుణాల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఒక్కరికీ కూడా రుణం అందకపోవడం, కనీసం ఒక ప్రణాళిక కూడా రూపొందించకపోవడంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా ఆర్యవైశ్యులకు కేటాయించకపోవడంపై టీడీపీ పట్ల ఆ సామాజికవర్గంలో అసహనం వ్యక్తమవుతోంది. బాబుగారి కార్పొరేషన్‌ కహానీ వెనుకున్న కుట్రను అర్థం చేసుకున్న ఆర్యవైశ్యులు ప్రస్తుత ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు.

జగన్‌ పథకాలను కాపీ కొట్టి కార్పొరేషన్‌ ఏర్పాటు...
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఆయా కులాల్లోని పేదల అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జగన్‌ పథకాలు ఎక్కడ తన కొంప ముంచుతాయోనని చంద్రబాబు వాటిని కాపీ కొట్టారు. దానిలో భాగంగానే ఎన్నికలకు ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి జిల్లాకు చెందిన శిద్దా వెంకటేశ్వరరావును హడావిడిగా చైర్మన్‌గా నియమించి ఆ సామాజికవర్గం ఓట్లు కొల్ల గొట్టి మోసం చేయాలని ప్రయత్నించారు.

రుణాల కోసం దరఖాస్తు చేసిన వారికి నిరాశ...
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు కాగానే ఆ సామాజికవర్గానికి చెందిన ఆశావహులు రుణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 241 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో వాటి కోసం 2,473 మంది దరఖాస్తు చేశారు. త్రిపురాంతకం, ఉలవపాడు, యద్దనపూడి, బల్లికురవ, సీఎస్‌ పురం, దొనకొండ, హనుమంతునిపాడు, కందుకూరు, కొత్తపట్నం, లింగసముద్రం మండలాల్లో రుణాల లక్ష్యాన్ని కూడా నిర్దేశించలేదు. బల్లికురవ, సీఎస్‌ పురం, హనుమంతునిపాడు, కందుకూరు, కొత్తపట్నం, లింగసముద్రం, త్రిపురాంతకం, ఉలవపాడు, యద్దనపూడి మండలాల్లో లబ్ధిదారుల ఎంపికకు కనీసం ప్రణాళికను కూడా అధికారులు నిర్దేశించలేదు. మిగిలిన మండలాలు, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు అవకాశం కల్పించడంతో అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం మండలాల వారీగా అందిన దరఖాస్తులు...

మండలం  కేటాయించిన యూనిట్లు అందిన దరఖాస్తులు
అద్దంకి  1  20
అద్దంకి అర్బన్‌  25  79
అర్ధవీడు  3  28
బల్లికురవ  0  0
బేస్తవారిపేట  2   2
సీఎస్‌ పురం   0  0
చీమకుర్తి  4  18
చీమకుర్తి అర్బన్‌  4  8
చినగంజాం  1  87
చీరాల   3  33
చీరాల అర్బన్‌  4   64
కంభం  1  70
దర్శి  8  34
దొనకొండ  3  40
దోర్నాల  10  17
గిద్దలూరు  4  60
గిద్దలూరు అర్బన్‌  3  111
గుడ్లూరు  2  25
హనుమంతునిపాడు  0  0
ఇంకొల్లు  3  87
జె.పంగులూరు  1  23
కందుకూరు  0  4
కందుకూరు అర్బన్‌  4  9
కనిగిరి  3  10
కనిగిరి అర్బన్‌   10  116
కారంచేడు  3  41
కొమరోలు  3  16
కొనకనమిట్ల  1  16
కొండపి  4  31
కొరిశపాడు  2  34
కొత్తపట్నం  0  0
కురిచేడు  6  45
లింగసముద్రం  0  29
మద్దిపాడు  1  1
మార్కాపురం  2  27
మార్కాపురం అర్బన్‌  4  211
మర్రిపూడి  4  16
మార్టూరు  3  46
ముండ్లమూరు  4  27
నాగులుప్పలపాడు   3  39
ఒంగోలు   3  15
ఒంగోలు అర్బన్‌  40  107
పామూరు  2  15
పర్చూరు  3  47
పెద్దారవీడు  9  39
పీసీ పల్లి  1  18
పొదిలి  4  46
పొన్నలూరు  2  16
పుల్లలచెరువు  3  32
రాచర్ల   3  16
సంతమాగులూరు  1  25
సంతనూతలపాడు  3  29
సింగరాయకొండ  4  45
టంగుటూరు  4  19
తాళ్లూరు  4  19
త్రిపురాంతకం  0  92
ఉలవపాడు  0  52
వెలిగండ్ల   2  26
వేటపాలెం  4  67
వలేటివారిపాలెం  2  13
యద్దనపూడి  0  0
యర్రగొండపాలెం  4  53
జరుగుమల్లి  4  23
మొత్తం  241  2,473

ఆర్యవైశ్యులకు అన్యాయం చేశారు
ఆర్యవైశ్యులకు ప్రకటించిన కార్పొరేషన్‌ రుణాలు ఎక్కడా ఇవ్వలేదు. జిల్లాలో మంత్రిగా శిద్దా రాఘవరావు ఉన్నప్పటికీ ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్యవైశ్యులకు తీవ్రంగా అన్యాయం చేశారు. టీడీపీని ఆర్యవైశ్యులు నమ్మే ప్రసక్తే లేదు. గిద్దలూరు ప్రాంతంలో సుమారు 12 వేల మంది ఆర్యవైశ్యులు ఉంటే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ద్వారా రుణాల మంజూరు జాబితాలో కేవలం ముగ్గురి పేర్లే ఉన్నాయి. వారికి కూడా నేటికీ రుణాలు మంజూరు కాలేదు.
- గర్రె శ్రీనాథ్, ఆర్యవైశ్య యువజన సంఘ మండల అధ్యక్షుడు, గిద్దలూరు

రుణం కోసం కాళ్లరిగేలా తిరిగా 
టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా రుణాలిస్తామని ప్రకటించడంతో దరకాస్తు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఇంటి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం హామీలిచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది.
- సుబ్రహ్మణ్యం, బుక్‌ స్టోర్‌ వ్యాపారి, గిద్దలూరు

ఎన్నికల కోసం హడావిడి మినహా చేసిందేమీ లేదు 
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో చంద్రబాబు కూడా హడావిడిగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మోసపూరిత మాటలు చెప్పారు. చైర్మన్, పాలకమండలి సభ్యులను నియమించడం మినహా ఒక్కరికి కూడా లబ్ధిచేకూర్చలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోమని సూచించడంతో పేద ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కరికీ రుణం మంజూరు చేయకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆర్యవైశ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడతాం.
- కుప్పం ప్రసాద్, వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్యవైశ్య అధ్యయన కమిటీ రాష్ట్ర చైర్మన్‌

చంద్రబాబు మోసం చేశారు
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఎన్నికలకు ముందు వైశ్యులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఎవరికీ లబ్ధి చేకూర్చలేదు. కేవలం ఎన్నికలు, ఓట్ల కోసమే కోడ్‌ వచ్చేందుకు 20 రోజులు ముందుగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు.
- చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్, మార్కాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement