మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్!
సింగపూర్ సంస్థ ఎంపికకు సర్కారు కసరత్తు
* స్విస్ చాలెంజ్ విధానంపై అసెండాస్ ఆసక్తి
* రాజధాని భూముల లీజుపై వచ్చే డబ్బుతోనే మౌలిక వసతులు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో పాల్గొనేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తూ అసెండాస్ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళిక వచ్చిన తర్వాత రాజధానిలో మౌలిక వసతుల కల్పన పనులు ఎంతకు చేయనున్నదనే సవివరమైన నివేదికను అసెండాస్ సంస్థ ప్రభుత్వానికి సమర్పించనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో.. అసెండాస్ సంస్థ ఉదాహరణకు రూ.100 కోట్లకు పనులు చేపడతామని, ప్రభుత్వానికి ఇంత రెవెన్యూ చేకూర్చుతామని స్పష్టం చేసిన పక్షంలో అసెండాస్ కన్నా తక్కువ మొత్తానికి పనులు చేపట్టే సంస్థలు ఏమైనా ఉంటే రావచ్చునంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది.
అసెండాస్ కన్నా రూ.10 కోట్లు తక్కువకు చేస్తానంటూ మరో సంస్థ ముందుకు వస్తే అప్పుడు ప్రభుత్వం.. ఆ మరో సంస్థ చేస్తానన్న ధరకు చేస్తారా? అని తిరిగి అసెండాస్‌ను అడుగుతుంది. అందుకు అసెండాస్ అంగీకరించిన పక్షంలో ఆ సంస్థకే మాస్టర్ డెవలపర్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నూతన రాజధానిలో రహదారులు, నీళ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన పనులన్నింటికీ అయ్యే వ్యయాన్ని పూర్తిగా మాస్టర్ డెవలపర్‌గా ఎంపికయ్యే సంస్థనే తొలుత భరిస్తుంది.
నూతన రాజధానిలో భూములను పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నారు. ఆ భూముల లీజు ద్వారా వచ్చిన డబ్బులను, అలాగే సీఆర్‌డీఏ నిధికి జమయ్యే మొత్తాల నుంచి మాస్టర్ డెవలపర్‌కు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. నూతన రాజధానిలో విద్యుత్ లైన్లు, సరఫరాను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుంది. రాజధాని మాస్టర్ ప్రణాళికను గత నెలలో సింగపూర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. అప్పుడు కేవలం మ్యాప్‌లను మాత్రమే సమర్పించారు.
ఆ మాస్టర్ ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలను సింగపూర్ కంపెనీలు ఇంకా సమర్పించాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 22, 23వ తేదీల్లో సింగపూర్ కంపెనీల ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు రానుంది. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను ఈ నెలాఖరుకు నాటికి సింగపూర్ కంపెనీలు సమర్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీకల్లా సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను సమర్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కొన్ని చేర్పులు, మార్పులను సూచించినందున సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళిక సమర్పణకు జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి.