ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో ఏపీ శాసనసభ బీసీ కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు తెలిపారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై సమీక్ష
కర్నూలు (అర్బన్) : ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో ఏపీ శాసనసభ బీసీ కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కమిటీ చైర్మన్ జి.తిప్పేస్వామి ఆధ్వర్యంలో 28వ తేదీన ఉదయం 8.30 గంటలకు కర్నూలుకు వస్తున్న కమిటీ ముందుగా మల్యాలలో హంద్రీనీవా ఎస్‌ఈతో బీసీ ఉద్యోగుల సంక్షేమంపై సమావేశం నిర్వహిస్తారన్నారు. 11 గంటల నుంచి 12.45 వరకు కర్నూలులో ఇరిగేషన్ ఎస్‌ఈతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పథకంలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమంపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
మధ్యాహ్నం 1 గంటకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బీసీ ప్రజా సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారన్నారు. 3 గంటలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్‌తో సమీక్షిస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఆర్‌డీఓ కార్యాలయంలో జిల్లాలోని బీసీ వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం అవుతారన్నారు. రాత్రి 7.30 గంటలకు మంత్రాలయం బీసీ వసతి గృహాన్ని పరిశీలిస్తారని సంజీవరాజు తెలిపారు. అదే రోజు రాత్రి మంత్రాలయంలో బస చేసి 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఆదోని ఆర్‌డీఓ కార్యాలయంలో బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు బీసీ హెచ్‌డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
ఉదయం 11 గంటలకు ఆదోని నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నంద్యాలకు చేరుకొని అక్కడి ఆర్‌డీఓ కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి డివిజన్‌లోని బీసీ వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం అవుతారని చెప్పారు. 4 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి మహానంది చేరుకొని దేవస్థానం ఈఓతో సమావేశం నిర్వహిస్తారని, అక్కడి నుంచి 5 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారని ఆయన వివరించారు.