మార్చి 6న బడ్జెట్!
- మార్చి 1వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- తేదీలకు సీఎస్ ఆమోదం.. ఆర్థిక మంత్రికి ఫైలు
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించని చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా వీలైనన్ని తక్కువ రోజులు నిర్వహించాలని ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 18 పనిదినాల్లో ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీన గవర్నర్ ఉభయసభలనుద్దేశించి చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
6వ తేదీన వార్షిక (2017–18) బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి సమర్పించనున్నారు. మార్చి 27వ తేదీతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు. అంటే సెలవు రోజులు పోను బడ్జెట్ సమావేశాలు 18 రోజులు జరగనున్నాయి. సమావేశాల తేదీల ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ శుక్రవారం ఆమో దం తెలిపి ఆ ఫైలును ఆర్థిక మంత్రి ఆమో దానికి పంపించారు. ఆర్థిక మంత్రి ఆమోదం అనంతరం ముఖ్యమంత్రి, గవర్నర్‌ల ఆమో దానికి ఫైలు వెళ్లాల్సి ఉంది.