ఉత్తరాఖండ్‌పై చర్చ
అఖిలపక్షంలో ప్రతిపక్షాల పట్టు
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్‌పై చర్చించాలంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సమావేశం అనంతరం కాంగ్రెస్ లోక్‌సభ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చించాలని కోరామని, అనేక మంది ప్రతిపక్ష సభ్యులు కూడా మద్దతిచ్చారన్నారు. విషయ ప్రాధాన్యత దృష్ట్యా నిబంధనలు పక్కనపెట్టి దేన్నైనా అనుమతించేందుకు స్పీకర్‌కు అధికారముందన్నారు. చర్చ కోరుతూ తమ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇస్తారన్నారు.
ఉత్తరాఖండ్ అంశంపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 27 వరకూ స్టే విధించిందని, అప్పటి వరకూ చర్చ ఉంటుందని అనుకోవడం లేదని స్పీకర్ చెప్పారు. సమావేశాలు సజావుగా సాగుతాయని, అన్ని పార్టీలు సహకరిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ కేసు కోర్టు పరిధిలో ఉంది కనక సమావేశాల్లో చర్చించే అవకాశం లేదని మంత్రి రూడీ చెప్పారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామంటూ అఖిలపక్షంలో పార్టీలు హామీనిచ్చాయన్నారు. ఢిల్లీలో అమలుచేస్తోన్న సరి-బేసి వాహన విధానం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో ఎంపీల కోసం అదనపు వాహనాల్ని ఏర్పాటు చేయాలని అధికారుల్ని స్పీకర్ ఆదేశించారు.
ఉత్తరాఖండ్‌పై ఏకతాటిపైకి ప్రతిపక్షాలు
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై ఉమ్మడి పోరుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని లెఫ్ట్ పార్టీలు, జేడీయూతో పాటు ఇతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మరోవైపు లోక్‌సభలో 13, రాజ్యసభలో 11 బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు భారీ అజెండాతో ప్రభుత్వం సిద్ధమైంది.