సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ అహంకారానికి చెంపపెట్టని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు దునుమాడారు. బీజేపీపై దుష్ర్పచారం చేసినా, నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించినా, ఓట్ల కోసం చివరి నిమిషం వరకు అనేక ప్రలోభ పథకాలు ప్రకటించినా ఓటర్లు కాంగ్రెస్‌ను తుంగలో తొక్కి విజ్ఞత చాటారన్నారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, అరుణాజ్యోతి, ఎన్.రామచంద్రరావు, ఎస్.కుమార్‌తో కలిసి ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా కాంగ్రెస్ వ్యతిరేకతే వ్యక్తమైందన్నారు. అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పాలన సాగించిన బీజేపీయే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ సహా కాంగ్రెస్ నేతలందరూ ఓడిపోవడమే ప్రజలు మార్పుకోరుతున్నారనే దానికి నిదర్శనమని చెప్పారు. ఆదర్శ పాలన అందిస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బాగా స్పందించారన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలోనూ గెలుస్తాం: కిషన్‌రెడ్డి
కుటుంబ వారసత్వ రాజకీయాలను తోసిరాజని ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశ ప్రజలు మార్పుకోరుతున్నారనే దానికి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయమే సంకేతమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏమి చేయబోతున్నారో, ఏమి కోరుకుంటున్నారో ఈ ఫలితాలు స్పష్టంచేశాయని చెప్పారు. రాష్ట్ర అనిశ్చితికి తెరపడి ఉభయ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, మోడీ హవా కొనసాగుతుందన్నారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని దత్తాత్రేయ చెప్పారు. రాహుల్ పేరు చెబితేనే ప్రజలు పారిపోతున్నారని నాగం జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలన్నారు.