డేట్ దాటితే డేంజరే!
* వంట గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్
* వినియోగదారులూ జాగ్రత్త
మండపేట రూరల్ : ఎక్స్‌పైరీ డేట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మెడిసిన్, ఇంజక్షన్‌లు, కూల్ డ్రింక్స్, తినుబండారాలు, ఎక్స్‌ట్రాఎక్స్‌ట్రా... అయితే మనం నిత్యం వాడే గ్యాస్ సిలిండర్‌కూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే సంగతి మీకు తెలుసా..? చాలా మందికి తెలియదు కదూ... అయితే ఈ కథనం చదవండి... చాలా వరకు మనం ఇంటికి వచ్చిన సిలిండర్‌ను పూర్తిగా గమనించం... గమనిస్తే సిలిండర్ రింగ్ కింది భాగంలో వాటి తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్‌పైరీ డేటు) కూడా ముద్రిస్తారు. ఆ తేదీలను ఏ,బీ,సీ,డీలుగా విభజిస్తారు. అంటే జనవరి - మార్చి(ఏ), ఏప్రిల్- జూన్(బి), జూలై- సెప్టెంబర్(సీ), అక్టోబర్- డిసెంబర్(డి)గా ముద్రిస్తారు. ఉదాహరణకు సిలిండర్ కాలపరిమితి 2014 మే నెలతో ముగుస్తుందనగా, దానిపై బీ-14 అని ముద్రిస్తారు.
ప్రమాదం సుమా!
కాలపరిమితి ముగిసిన సిలిండర్‌లు వాడడ ం వల్ల అవి పేలి ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇలా కాలపరిమితి ముగిసిన సిలిండర్‌లను కంపెనీలు ముందుగానే గుర్తించి వాటిని పక్కన పెడతాయి. అలా కాకుండా పొరపాటున కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వస్తే వాటిని గుర్తించి డెలివరీ బాయ్‌కు సమాచారమివ్వాలి. వారొచ్చి కొత్త సిలిండర్‌ను అందజేస్తారు.
గ్యాస్ వినియోగంలో కొన్ని మెళకువలు...
గ్యాస్ వినియోగంలో కొద్దిపాటి మెళకువలు పాటిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. సిలిండర్‌కు స్టౌకి తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకే సిలిండర్‌కు రెండు స్టౌలు ఉంచకూడదు. సిలిండర్‌ను కబ్ బోర్డులో పెట్టినట్టయితే తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. వంటగది కిటికీలు తెరిచే ఉంచుకోవాలి. వంట చేసేటప్పడు మినహా మిగిలిన సమయంలో రెగ్యులేటర్ ఆఫ్‌లో చేయాలి. రెగ్యులేటర్ నుంచి స్టౌవ్‌కి గ్యాస్ సరఫరా చేసే ట్యూబ్‌కు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే పెనుప్రమాదాలు జరగకుండా చేయవచ్చు.