రూ.600కే గ్యాస్ సిలిండర్
టీ నగర్: వంట గ్యాస్ సబ్సిడీని ఒకే నెలలో రూ.100 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.600కు కొనుగోలు చేయవచ్చు. వంట గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ పథకం జనవరి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను పూర్తి ధర చెల్లించి ప్రజలు కొనుగోలు చేయాల్సి వుంది. దీనికి సంబంధించిన సబ్సిడీ వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లించనున్నారు.
జనవరిలో సిలిండరు ధర రూ.410, సబ్సిడీ రూ.300 మొత్తం రూ.710 చెల్లించి గ్యాస్ ఏజన్సీల వద్ద ప్రజలు సిలిండర్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన సబ్సిడీ సొమ్ము రూ.300 వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు చేరింది. వంట గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ పథకం రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నెలలోనే సబ్సిడీ మొత్తం హఠాత్తుగా తగ్గించారు. గత నెల సబ్సిడీ రూ.300 అందజేయగా ఈ నెల రూ.200కు తగ్గించారు. ఈ నెలలో సిలిండర్ కొనుగోలు చేసేవారు రూ.600 చెల్లించి కొనుగోలు చేయాల్సివుంటుంది.