అనంతపురం అగ్రికల్చర్: ఈ ఇద్దరే కాదు జిల్లాలో ఇలాంటి రైతుల వందల సంఖ్యలో ఉన్నారు. చీనీ తోటలు ఇప్పటికే ఎండిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేసవి ప్రారంభంలోనే సుమారు 200 ఎకరాల్లో కాపునకు వచ్చినవి, ఐదేళ్లకు పైబడిన తోటలు ఎండిపోవడంతో రైతులకు రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఏప్రిల్, మే నెలల్లో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చే పరిస్థితి ఉండటంతో చీనీ తోటలకు పెనుముప్పు పొంచివున్నట్లు రైతులు భయపడిపోతున్నారు. బోర్ల నుంచి నీరు రావడం గగనమై పోతుండటంతో పెద్ద ఎత్తున చీనీ తోటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఉద్యానశాఖ అధికారులు కూడా అంచనా వేశారు.
ఒక ఎకరా చీనీ తోటలు పెంచడానికి మొదటి సంవత్సరం రూ.35 వేలు ఖర్చు అవుతుండగా రెండో సంవత్సరం రూ.18 వేలు, మూడో సంవత్సరం రూ.22 వేలు, నాలుగో సంవత్సరం రూ.26 వేలు, ఐదో సంవత్సరం రూ.28 వేలు వెచ్చిస్తే ఐదేళ్లకు మొదటి పంట చేతికి వస్తుంది. ఐదు సంవత్సరాల తరువాత ఏటా రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సివుంటుంది.
ఇలా లక్షలు వెచ్చించి పెంచిన చీనీ తోటలు ఒక్కసారిగా ఎండిపోతే రైతుకు జరిగే నష్టం అపారం. ఓ వైపు తీవ్రమైన వేసవితాపం, అరకొర నీటి తడులు ఇవ్వడం వల్ల చీనీకి ఎండుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల దిగుబడులు తగ్గిపోవడం, వచ్చినా నాణ్యత లోపించడంతో నష్టం వాటిల్లుతోంది. అలాగే కాయ కోత, మార్కెటింగ్ సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది చీనీ రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే ప్రమాదం పొంచివుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో చీనీ తోటలు, ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిన ‘అనంత’లో ఇపుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. చీనీ తోటలు 40 వేల హెక్టార్లలో ఉన్నాయి. తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, శింగనమల, తాడిమర్రి, బత్తలపల్లి, గార్లదిన్నె, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. ఏటా 6.60 లక్షల మెట్రిక్ టన్నుల చీనీ దిగుబడులు వస్తుండగా రమారమి సంవత్సరానికి చీనీ రైతులు రూ.750 కోట్ల మేర టర్నోవర్ జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేరుశనగ తో దెబ్బతింటున్న జిల్లా రైతులు గత కొన్నేళ్లుగా పండ్లతోటల వైపు దృష్టి సారించి అంతో ఇంతో ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడూ అవీ దెబ్బతినడం రైతుకు అశనిపాతమే.
ఈ రైతు పేరు పెద్దయ్య, రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామం. ఉన్న రెండు బోర్లలో నీళ్లు ఆశాజనకంగా వస్తుండటంతో 9 సంవత్సరాలుగా మూడు ఎకరాల్లో 300 చీనీ చెట్ల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్టుకొస్తున్నాడు. ఇపుడు ఉన్నఫలంగా రెండు బోర్లలోనూ గుక్కెడు కూడా నీరు రావడం గగనమైపోయింది. 300 చీనీ చెట్లు ఎండుముఖం పట్టడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కాపులో ఉన్న చెట్లు ఎండిపోతుండటంతో ఉద్యానశాఖ అధికారుల దగ్గర మొరపెట్టుకోవడం మినహా చెట్లను కాపాడుకోలేని దయనీయస్థితి.
ఎండిపోయిన చీనీతోటలో దిగాలుగా కనిపిస్తున్న రైతు పేరు బయన్న, పామిడి మండలం కండ్లపల్లి గ్రామం. ఈ రైతు పరిస్థితీ అదే పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరుబావుల నుంచి నీళ్లు రావడం ఆగిపోయాయి. మూడు ఎకరాలకు పైగా ఉన్న ఆరు సంవత్సరాల చీనీ తోట కళ్లెదుటే ఎండిపోవడంతో ఎలా బతకాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
చితికిపోయారు..
Published Sun, Mar 22 2015 11:27 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement