పెద్దశంకరంపేట, న్యూస్‌లైన్: ఓ కామాంధుడు వదినపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట సీఐ సైదానాయక్, ఎస్‌ఐ సత్యనారాయణ కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాశమోళ్ల సుజాత (27), రమేష్ దంపతులు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం పెద్దశంకరంపేటకు వలస వచ్చారు. స్థానిక పెట్రోల్ బంక్ సమీపాన గుడిసె వేసుకుని రోకళ్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం క్రితం జీవనోపాధి కోసం రమేష్ పెద్ద నాన్న కుమారుడైన చందర్ కూడా వీరికి జతకట్టాడు.
వీరితో కలిసి రోకళ్ల తయారీలో పాలుపంచుకునే వాడు. ఇదిలా ఉండగా రమేష్‌కు జ్వరం రావడంతో మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామమైన రుద్రారానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన చందర్ ఆ రోజు మద్యం సేవించి అర్ధరాత్రి వదిన వరసైన సుజాత నోటికి లుంగీ, టీ షర్టు చుట్టి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కాగా భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతురాలికి ఏడాది వయసు ఉన్న కుమారుడున్నాడు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేసింది.
వదినపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో దారుణహత్య
Published Thu, Oct 24 2013 5:15 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
Advertisement
Advertisement