పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సముద్రంలో స్నానం చేస్తుండగా ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు గల్లంతయ్యారు. అతని స్నేహితులు, మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఆర్‌కేబీచ్‌లో శనివారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారిలోని నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు కురుసుర జలాంతర్గామి మ్యూజియం వెనుక భాగంలో సముద్రంలో స్నానాలకు దిగారు. వీరిలో బర్రి నీలేష్(18) బలమైన కెరటాల ఉధృతికి సముద్రంలో ఉదయం 8.30 గంటల సమయంలో కొట్టుకుపోయాడు. వెంటనే ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు విషయాన్ని బీచ్ పెట్రోలింగ్, మూడో పట్టణ బ్లూ కోట్ పోలీసులకు తెలియజేశారు. వారు ఘటనాస్థలికి చేరుకున్నాక లైఫ్‌గార్డులు సముద్రంలో నీలేష్ కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. నీలేష్ ఏయూలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మద్దిలపాలెం చైతన్యనగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. నీలేష్ తండ్రి బర్రి రవిశంకర్ నేవీలో యూసీడీగా పనిచేస్తున్నారు. అతనికి ఒక సోదరి కూడా ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఇమ్మానియేల్‌రాజు పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చైతన్యనగర్‌లో విషాదం
మద్దిలపాలెం చైతన్యనగర్‌లో విషాదం నెలకొంది. సముద్రంలో ఉదయం నీలేష్ కొట్టుకుపోయాడని సమాచారం అందగానే అతని తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. కాలనీలో ఎప్పుడూ అందరితోనూ చలాకీగా వుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఉదయం బీచ్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి ఇలా గల్లంతవడంతో కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment