
ఆ కుర్చీ మాకొద్దు!
కర్నూలు తహసీల్దార్‌గా రావడానికి జంకుతున్న అధికారులు
► ప్రొటోకాల్ పేరుతో వెయిటర్‌ను తలపించే పోస్ట్
► వీఐపీల సపర్యలకు నెల ఖర్చు రూ.60వేలు
► రూ.3లక్షలకు పైగా బిల్లులు పెండింగ్
► ఖర్చుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఆర్‌ఐలు!
కర్నూలు సీక్యాంప్: ఒకప్పుడు కర్నూలు తహ సీల్దార్ కుర్చీకి ఎంతో డిమాండ్. ఈ సీటును ఆశించే వారు ఫైరవీలు, పాలకుల సిఫారసు, డబ్బు, లాంటి అస్త్రాలను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు తహసీల్దార్ పోస్టు అనగానే ఆమడదూరం జరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మండల రెవెన్యూ అధికారి ఉద్వోగం వీఐపీల భోజనం, టిఫిన్‌ల మెనూ తీసుకునే వెయిటర్‌ను తలపిస్తోంది. దీంతో కర్నూలు తహసీల్దార్లుగా వచ్చిన వారు ఐదునెలలు తిరగకముందే ఇక్కడ ఉండలేం.. మమ్మల్ని బదిలీ చేయండని మంత్రులు, కలెక్టర్‌ల వెంట తిరుగుతున్నారు.
ప్రొటోకాల్ డ్యూటీలో భాగంగా వీఐపీల టిఫిన్ నుంచి మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌కు అయ్యే ఖర్చు తహసీల్దార్ కార్యాలయమే చూసుకోవాలి. వీటికంతా ప్రతి రోజు రూ. 20నుంచి 30వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.60,000వేలు అవుతుంది. దీనికి ఉన్నతాధికారులు బిల్లులు పెట్టుకోమంటారు. అయితే, ఎప్పుడు మంజూరవుతుందో చెప్పలేని పరిస్థితి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రూ. 1.50 లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ.
అడ్డదార్లు తొక్కుతున్న ఆర్‌ఐలు:
ఖర్చుపెట్టిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్‌ఐలు తమ జేబునుంచి పైసలు తీయలేక జనం మీద పడుతున్నారు. దీంతో ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా ఒక రేటు నిర్ణయించి వచ్చిన డబ్బులతో వీఐపీలకు సేవలు చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఇదేంటని జనం ప్రశ్నిస్తే వీఐపీల ఖర్చు ఎవరు పెట్టుకుంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వీరికి పై స్థాయి అధికారులు మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
గ్రూప్2 ఆఫీసర్ వెయిటర్ అయిన వేళ:
ఆర్‌ఐలు ఫీల్డ్‌వర్క్‌కు వెళ్లినప్పుడు నేరుగా తహసీల్దార్ వెళ్లి వీఐపీల మెనూ తీసుకోవాలి. ఉదయం ఏ హోటల్ నుంచి టిఫిన్ తెప్పించాలి, మధ్యాహ్నం,రాత్రి ఏ హోటల్ నుంచి భోజనం తెప్పించాలని వీఐపీలను ఒక గ్రూప్2 ర్యాంక్ స్థాయి ఉద్యోగి అడగడం ఇక్కడ సాధారణంగా మారింది. దీన్ని చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. సమయమంతా వీఐపీల సేవలో గడిచిపోతే జనానికి పనులు చేసేదెప్పుడనే ప్రశ్న తలెత్తుతుంది.
సంవత్సరం క్రితం బిల్లులు పెండింగ్‌లో
కిందటి సంవత్సరంలో తహసీల్దార్‌గా పనిచేసిన శేషఫణి తన పిరియడ్‌లో ప్రోటోకాల్ డ్యూటీ కోసం దాదాపు రూ.3లక్షలు ఖర్చుపెట్టారు. శేషఫణి ప్రస్తుతం బదిలీ అయి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు రూ.3 లక్షల బిల్లు విడుదల కాలేదు.
ఎప్పటి బిల్లులు అప్పుడే క్లియర్ చేస్తున్నాం:
సాధ్యమైనంత వరకు మా దగ్గర ఉన్న బిల్లులన్నీ పూర్తి చేశాం. జిల్లాలో వివిధ తహసీల్దార్ కార్యాలయాలకు పెండింగ్, విడుదల చేసిన బిల్లుల సమాచారాన్ని చేరవేశాం. ప్రోటోకాల్‌కు సంబంధించిన సమాచారం తహసీల్దార్ దగ్గర ఉంటుంది. డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్